నేడు భారత్, జింబాబ్వే తొలి టి20 మ్యాచ్
ఆత్మవిశ్వాసంతో టీమిండియా
సొంతగడ్డపై ఆశలతో జింబాబ్వే
సా.గం.4.30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌లలో ప్రసారం
టి20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది...ఇంకా దేశంలో సంబరాలు, వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు టీమిండియా మరో టి20 పోరుకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఆటతో పోలిస్తే ఇది కాస్త భిన్నమైంది. రోహిత్, కోహ్లి, జడేజాల రిటైర్మెంట్ తర్వాత జట్టు కాస్త కొత్తగా కనపడబోతోంది.
తమ అవకాశాల కోసం ఎదురు చూస్తూ వచ్చిన యువ ఆటగాళ్ల సత్తాను ప్రదర్శించేందుకు ఇది సరైన వేదిక కానుంది. వరల్డ్ కప్ టీమ్‌లో అవకాశం దక్కించుకోలేకపోయిన గిల్ నాయకత్వ సామర్థ్యానికి కూడా ఈ సిరీస్ పరీక్ష కానుండగా... సొంతగడ్డపై జింబాబ్వేవిజయాన్ని అందుకోవాలని ఆశిస్తోంది.
హరారే: పేరుకే ఇది భారత్‌కు చెందిన ద్వితీయ శ్రేణి జట్టు కావచ్చు. కానీ అగ్రశ్రేణి ఆటగాళ్లందరితో కలిసి ఆడిన, ఎదుర్కొన్న అపార ఐపీఎల్ అనుభవంతో యువ ఆటగాళ్లంతా కూడా అన్ని రకాలుగా సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది.
వరల్డ్ కప్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు స్వదేశానికి వచ్చిన సామ్సన్, యశస్వి, దూబే తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. మూడో టి20 సమయానికి వీరు జట్టుతో చేరతారు. 2026 టి20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని భారత సెలక్టర్లు సిద్ధం చేయదలిచే బృందంలో కొందరి ప్రదర్శనపై ఇక్కడినుంచే ఒక అంచనాకు రావచ్చు.
గిల్ కెప్టెన్సీలో...
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించి సరైన ఫలితాలు రాబట్టలేకపోయిన శుబ్‌మన్ గిల్ తొలి సారి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఓపెనర్‌గా అతనితో పాటు అతని బాల్య మిత్రుడు, అండర్–19 వరల్డ్ కప్ సహచరుడు అభిషేక్ శర్మ ఆడటం ఖాయమైంది. అభిషేక్ కు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది.
ఇటీవల ఐపీఎల్‌లో భీకర ఫామ్‌తో అదరగొట్టిన అభిõÙక్ ఇక్కడ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. మూడో స్థానంలో రుతురాజ్ ఖాయం కాగా, రియాన్ పరాగ్ కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వరల్డ్ కప్‌లో రిజర్వ్‌గా ఉండి ఆడే అవకాశం రాని రింకూ సింగ్‌పై కూడా అందరి దృష్టీ నిలిచింది. తన దూకుడును ప్రదర్శించేందుకు రింకూకు ఇంతకంటే మంచి అవకాశం రాదు.
బౌలింగ్‌లో కూడా ఐపీఎల్‌లో ఆకట్టుకున్న ఖలీల్, అవేశ్, బిష్ణోయ్‌లపై జట్టు ఆధారపడుతోంది. ప్రతిభ ఉన్నా...వరుస గాయాలతో పదే పదే సీనియర్ జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. కీపర్‌గా తొలి ప్రాధాన్యత జురేల్‌కు దక్కవచ్చు. ఈ మ్యాచ్‌లో భారత్‌నుంచి ఎంత మంది అరంగేట్రం చేస్తారనేది ఆసక్తికరం.
రజాపైనే భారం...
జింబాబ్వే కూడా కొత్త కుర్రాళ్లపైనే దృష్టి పెట్టింది. అందుకే సీనియర్లలో ర్యాన్ బర్ల్‌పై వేటు వేసిన జట్టు సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఇర్విన్‌లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చి0ది.
డ్రగ్స్ వాడిన ఆరోపణలతో నాలుగు నెలలు సస్పెన్షన్‌కు గురైన మదవెర్, మవుతా తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే కెప్టెన్ సికందర్ రజాపైనే జింబాబ్వే ప్రధానంగా ఆధారపడుతోంది. ఇటీవల వైటాలిటీ బ్లాస్ట్‌లో చెలరేగిన అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. మసకద్జ, ముజరబానిలనుంచి అతనికి సహకారం అందాల్సి ఉంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: గిల్ (కెప్టెన్ ), అభిషేక్, రుతురాజ్, పరాగ్, రింకూ, జురేల్, సుందర్, బిష్ణోయ్, అవేశ్, తుషార్, ఖలీల్
జింబాబ్వే: రజా (కెప్టెన్ ), బెనెట్, మరుమని, క్యాంప్‌బెల్, నక్వి, మదాందే, మదవెర్, జాంగ్వే, ఫరాజ్, మసకద్జ, ముజరబాని
పిచ్, వాతావరణం
నెమ్మదైన పిచ్. భారీ స్కోర్లకు అవకాశం లేదు. గత 12 మ్యాచ్‌లలో 5 సార్లు మాత్రమే స్కోరు 150 పరుగులు దాటింది. పొడి వాతావరణం. వర్ష సూచన లేదు.
8 భారత్, జింబాబ్వే మధ్య 8 టి20లు జరిగాయి. 6 భారత్ గెలవగా, 2 జింబాబ్వే గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment