సిరీస్‌ విజయమే లక్ష్యంగా... | Today is Indias fourth T20 against Zimbabwe | Sakshi
Sakshi News home page

సిరీస్‌ విజయమే లక్ష్యంగా...

Published Sat, Jul 13 2024 4:07 AM | Last Updated on Sat, Jul 13 2024 10:00 AM

Today is Indias fourth T20 against Zimbabwe

నేడు జింబాబ్వేతో భారత్‌ నాలుగో టి20

మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ సొంతం 

జోరు మీదున్న టీమిండియా

సాయంత్రం గం. 4:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

హరారే: జింబాబ్వే పర్యటనలో భారత యువ జట్టు అంచనాలకు అనుగుణంగానే రాణిస్తోంది. తక్కువ స్కోర్ల తొలి టి20లో తడబడి అనూహ్యంగా ఓటమి పాలైనా... తర్వాతి రెండు మ్యాచ్‌లలో జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారీ స్కోర్లు చేసిన అనంతరం వాటిని నిలబెట్టుకుంది. ఇదే జోరులో మరో మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ సొంతం చేసుకోవాలని శుబ్‌మన్‌ గిల్‌ బృందం పట్టుదలగా ఉంది. జట్టు సభ్యులంతా ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. 

రుతురాజ్‌ నిలకడగా ఆడుతుండగా... అభిషేక్‌ శర్మ రెండో మ్యాచ్‌లో సెంచరీతో తన ధాటిని చూపించాడు. కెప్టెన్   గిల్‌ కూడా అర్ధ సెంచరీతో ఫామ్‌లోకి రాగా... వరల్డ్‌ కప్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత యశస్వి జైస్వాల్‌ కూడా చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. రింకూ సింగ్‌ కూడా రెండో టి20లో సిక్సర్ల మోత మోగించగా, గత మ్యాచ్‌లో ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాని సంజూ సామ్సన్‌ కూడా చెలరేగిపోగలడు. 

శివమ్‌ దూబే కూడా తన దూకుడును ప్రదర్శిస్తే ఇక ఈ లైనప్‌ను నిలువరించడం జింబాబ్వే బౌలర్లకు అంత సులువు కాదు. బౌలింగ్‌లో వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్‌ స్పిన్‌ను ప్రత్యర్థి బ్యాటర్లు తడబడుతున్నారు. తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన అవేశ్‌ స్థానంలో ముకేశ్‌కు మళ్లీ తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఈ మార్పు మినహా అదే జట్టు కొనసాగనుంది. మరోవైపు సిరీస్‌ను కోల్పోకుండా ఉండేందుకు జింబాబ్వే రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. 

గత రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు పేలవ ఫీల్డింగ్‌తో 7 క్యాచ్‌లు వదిలేయడంతో పాటు అదనపు పరుగులూ ఇచ్చింది. దీనిని నివారించగలిగితే టీమ్‌ పోటీనివ్వగలదు. మరోసారి కెప్టెన్‌ సికందర్‌ రజానే కీలకం కానుండగా... బెన్నెట్, మైర్స్, క్యాంప్‌బెల్‌లపై బ్యాటింగ్‌ భారం ఉంది. బౌలింగ్‌లో పేసర్‌ ముజరబాని, చటారా నిలకడగా ఆడుతున్నారు. సొంతగడ్డపై జింబాబ్వే తమ స్థాయికి తగినట్లు ఆడితే పోరు ఆసక్తికరంగా సాగవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement