శ్రీశాంత్పై జైల్లో హత్యాయత్నం!
మాజీ క్రికెటర్ శ్రీశాంత్పై జైల్లో హత్యాయత్నం జరిగిందట! ఈ విషయాన్ని శ్రీశాంత్ బావ బాలకృష్ణన్ తెలిపారు. 2013 మే నెలలో తీహార్ జైల్లో 26 రోజులు గడిపిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాడని ఆయన అన్నారు. జైలు ప్రాంగణంలో తాను నడిచి వెళ్తుండగా.. ఓ రౌడీ ఉన్నట్టుండి తన ముందుకు దూకాడని, పదునైన కత్తితో తనమీద దాడి చేశాడని చెప్పాడన్నారు. తనకు చేతిమీద గాయమైందని, తర్వాత ఆ రౌడీని జైలు సిబ్బంది తీసుకెళ్లారని బాలకృష్ణన్ అన్నారు. అయితే దీన్ని వివాదం చేయాలని తాము అనుకోవడం లేదని, అందుకే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని వివరించారు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతుండగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013 సంవత్సరంలో శ్రీశాంత్ ఔటయిన విషయం తెలిసిందే. తర్వాత ఇప్పుడు బెయిల్ మీద విడుదలై బయటే ఉన్నాడు. శ్రీశాంత్ మీద ఢిల్లీ పోలీసులు మోకా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీకోర్టులో విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చే నెలలో విడుదల అవుతుందని భావిస్తున్నారు.