
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన భారత పేస్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ తిరిగి క్రికెట్‌లోకి అడుగు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. కేరళ రంజీ ట్రోఫీ జట్టులోకి అతడిని ఎంపిక చేయడం దాదాపుగా ఖరారైంది. రంజీ కోసం ఎంపిక చేసే ప్రాబబుల్స్‌లో 37 ఏళ్ల శ్రీశాంత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు జట్టు కోచ్ టిను యోహానన్ వెల్లడించాడు. దాంతో అతని పునరాగమనం లాంఛనమే కానుంది. ‘కేరళ తరఫున శ్రీశాంత్ మళ్లీ ఆడాలని మేం కోరుకుంటున్నాం.
ఈ ఏడాది రంజీ ట్రోఫీ కోసం అతని పేరును కూడా పరిగణలోకి తీసుకుంటాం. కేరళలో కూడా ప్రతీ ఒక్కరు అదే కోరుకుంటున్నారు. ఇదంతా అతని ఫిజికల్ ఫిట్‌నెస్, బౌలింగ్ సత్తాను బట్టి ఉంటుంది. జట్టు నిర్దేశించిన ప్రమాణాలను శ్రీశాంత్ అందుకోవాల్సి ఉంటుంది’ అని యోహానన్ చెప్పాడు. కోవిడ్–19 కారణంగా ఎప్పటినుంచి క్రికెట్ మళ్లీ మొదలవుతుందో, రంజీ మ్యాచ్‌లు ఎప్పటినుంచో జరుగుతాయో ఎవరికీ తెలీదని... అయితే సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం శ్రీశాంత్‌కు ఉంది కాబట్టి అతను తన ఆటపై దృష్టి పెట్టవచ్చని టిను సూచించాడు.
నేపథ్యమిదీ...
భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది.
అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్‌కు ఊరట లభించింది. శ్రీశాంత్‌ను దోషిగానే గుర్తించిన సుప్రీం... జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది. మరో సారి క్రికెట్ ఆడేందుకు తాను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానన్న శ్రీశాంత్... కష్టకాలంలో తనకు అండగా నిలిచిన సన్నిహితులు, కేరళ క్రికెట్ సంఘానికి కృతజ్ఞతలు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment