
జింబాబ్వే జిగేల్
♦ శ్రీలంకపై తొలిసారి వన్డే సిరీస్ కైవసం
♦ 2009 తర్వాత విదేశీగడ్డపై సిరీస్ విజయం
హంబన్‌టోటా: అంచనాలకు అందని రీతిలో సంచలన ఆటతీరును ప్రదర్శించిన జింబాబ్వే జట్టు శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 3–2తో దక్కించుకుంది. సోమవారం జరిగిన ఐదో వన్డేలో ఈ జట్టు 3 వికెట్ల తేడాతో లంకపై నెగ్గింది. దీంతో 2009 అనంతరం జింబాబ్వే విదేశాల్లో వన్డే సిరీస్‌ను గెలిచింది. గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శనతో కిందిస్థాయికి దిగజారిపోయిన జింబాబ్వేకు లంకపై సిరీస్ గెలుపుతో పునరుజ్జీవం సాధించినట్టయ్యింది. 14 నుంచి ఇరు జట్ల మధ్య కొలంబోలో ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంకను ఆఫ్ స్పిన్నర్ సికిందర్ రజా (3/21) కట్టడి చేయడంతో 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 203 పరుగులు మాత్రమే చేయగలిగింది. పర్యాటక జట్టు బౌలింగ్ ధాటికి గుణరత్నే (59 నాటౌట్; 4 ఫోర్లు), గుణతిలక (52; 5 ఫోర్లు) మాత్రమే అర్ధ సెంచరీలతో రాణించా రు. ఆరుగురు బ్యాట్స్‌మెన్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. గ్రేమ్ క్రెమెర్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఆ తర్వాత స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 38.1 ఓవర్లలో ఏడు వికెట్లకు 204 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు మసకద్జా (86 బంతుల్లో 73; 9 ఫోర్లు, 1 సిక్స్), మిరే (32 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)ల మధ్య తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేరాయి. ముసకందా (49 బంతుల్లో 37; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ధనంజయకు నాలుగు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా సికిందర్ రజా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా మసకద్జా నిలిచారు.