
సాక్షి, హైదరాబాద్: గెలవాలనే కాంక్షతో తప్పుడుదారులు ఎంచుకోకుండా క్రీడాకారులంతా నిజాయతీగా, క్రీడాస్ఫూర్తితో ఆడాలంటూ భారత క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. శనివారం నగరంలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్‌జేఏ) అవార్డుల వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్ధమాన క్రీడాకారులంతా సరైన మార్గంలో విజయావకాశాలను సృష్టించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఆడాలని కోరారు. అనంతరం హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ఆయన ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును బహూకరించారు. ఆటగాళ్లను పతకాలతో సత్కరించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన పలువురు క్రీడాకారులు అవార్డులను అందుకున్నారు. పీవీ సింధు ‘బెస్ట్ ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్’, కిడాంబి శ్రీకాంత్ ‘బెస్ట్ మేల్ స్పోర్ట్స్ పర్సన్’ అవార్డులను అందుకోగా... పుల్లెల గోపీచంద్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్నారు. హాకీ దిగ్గజం ముకేశ్ కుమార్ ‘జీవిత సాఫల్య పురస్కారాన్ని’ అందుకున్నారు.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికైంది. ఇటీవల జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన హైదరాబాద్ జిమ్నాస్ట్ బుద్ధా అరుణారెడ్డి కోచ్ బ్రిజ్ కిశోర్‌కు రూ.25 వేలు ఆర్థిక సహాయాన్ని టీఎస్‌జేఏ అందించింది. ఈ కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్, ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అశ్విని పొన్నప్ప, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రంగారావు, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, రాష్ట్ర క్రీడల కార్యదర్శి బుర్రా వెంకటేశం, హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేక్, టీఎస్‌జేఏ అధ్యక్షుడు జాక్ గ్లాడ్‌సన్, ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, వర్ధమాన క్రీడాకారులు యడ్లపల్లి ప్రాంజల, దీక్షిత, స్నేహిత్ పాల్గొన్నారు.
ఇతర అవార్డు గ్రహీతలు
జూనియర్ ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్: దీక్షిత (వెయిట్‌లిఫ్టింగ్). జూనియర్ మేల్ స్పోర్ట్స్‌పర్సన్: స్నేహిత్ (టీటీ).మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్: సంజన (టెన్నిస్). అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్: బుద్ధా అరుణారెడ్డి (జిమ్నాస్టిక్స్). స్టాండ్ అవుట్ పెర్ఫామెన్స్: నితీశ్ కుమార్ (క్రికెట్) . బెస్ట్ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ . బెస్ట్ ప్రైవేట్ స్పోర్ట్స్ స్కూల్: ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అసోసియేషన్ ఆఫ్ ద ఇయర్: బ్యాడ్మింటన్. అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు స్పోర్ట్స్: రంగారావు (అథ్లెటిక్స్), మాన్ సింగ్ (క్రికెట్), విక్టర్ అమల్‌రాజ్ (ఫుట్‌బాల్), సీవీ నాగరాజ్ (టెన్నిస్).