![Steve Smith's 141 not out puts Australia in front in Ashes opener - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/26/Smith.jpg.webp?itok=kpqcHDHu)
బ్రిస్బేన్: టెయిలెండర్ల సహకారంతో ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ (326 బంతుల్లో 141 నాటౌట్; 14 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కీలక తరుణంలో చిరస్మరణీయ శతకంతో ఆసీస్ జట్టును ఆదుకున్నాడు. స్మిత్ అద్వితీయ సెంచరీ కారణంగా ఒకదశలో 7 వికెట్లకు 209 పరుగులతో ఇబ్బందుల్లో పడిన ఆస్ట్రేలియా చివరకు 328 పరుగులు సాధించి ఆలౌటైంది. 26 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టు రసవత్తరంగా మారింది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 165/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా షాన్ మార్‡్ష (51; 8 ఫోర్లు) వికెట్‌ను తొందరగానే కోల్పోయింది. ఆ తర్వాత టిమ్ పైన్ (13; 2 ఫోర్లు), స్టార్క్ (6) కూడా తక్కువ స్కోరుకే అవుటవ్వడంతో ఆసీస్ ఇన్నింగ్స్ తడబడింది. ఈ దశలో బౌలర్ కమిన్స్ (120 బంతుల్లో 42; 5 ఫోర్లు, ఒక సిక్స్) కెప్టెన్ స్మిత్‌కు అండగా నిలబడ్డాడు. మరోవైపు స్మిత్ కూడా ఏకాగ్రతతో ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో స్మిత్ 261 బంతుల్లో టెస్టుల్లో తన 21వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
వోక్స్ బౌలింగ్‌లో కమిన్స్ అవుటవ్వడంతో ఎనిమిదో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హాజల్‌వుడ్ (6), లయన్ (9) సహకారంతో స్మిత్ ఆసీస్ స్కోరును 300 పరుగులు దాటించడంతోపాటు 26 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్‌కు మూడు, అండర్సన్, మొయిన్ అలీలకు రెండేసి వికెట్లు లభించాయి. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను హాజల్‌వుడ్ ఆరంభంలోనే దెబ్బతీశాడు. అనుభవజ్ఞుడైన కుక్ (7), జేమ్స్ విన్స్ (2)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం స్టోన్‌మన్ (19 బ్యాటింగ్), జో రూట్ (5) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment