సిడ్నీ : 2020 ఏడాది చివర్లో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' భారత్, ఆస్ట్రేలియాలు ఆడే ఏ సిరీస్ అయిన ఆసక్తికరంగానే ఉంటుంది. ఇది ఒక సంప్రదాయంలా మారింది. ఇంకా 12 నెలలు టైం ఉన్నా ఇప్పుడే నాకు సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం భారత జట్టు ప్రపంచంలోనే అగ‍్రస్థానంలో ఉందనడంలో సందేహం లేదు. నేను ఆస్ట్రేలియాతో జరగనున్న గులాబి టెస్టుకోసం ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే మా దేశంలో ఏ జట్టుకైనా డే- నైట్ టెస్టు ఆడడమంటే సవాల్ కిందే లెక్క. అయితే ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లను పరిశీలిస్తే మంచి రసవత్తర పోరు ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే భారత్‌తో సిరీస్ చిరకాలం గుర్తుండిపోనుంది. రెండు జట్లు ప్రస్తుతం కఠినమైన క్రికెట్ ఆడుతున్నాయి. స్మిత్, వార్నర్ బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత మా జట్టు వేగంగా ఫుంజుకుంది.
అది ఎంతలా అంటే లబుషేన్ లాంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జట్టుకు దొరికారు. ఆస్ట్రేలియా జట్టు 2019లో భారత్‌ను వారి సొంతగడ్డపైనే వన్డే, టీ20 సిరీస్‌లలో ఓడించి మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఐసీసీ టోర్నీలను కైవసం చేసుకోవడం అంత సులభం కాదు. భారత్‌కు వాటిని సాధించే స్వామర్థ్యం ఉంది. ఎలాంటి టోర్నీలైనా భారత్‌తో మా పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. టెస్టు చాంపియన్‌షిప్ టోర్నీ నుంచి నాలుగురోజుల టెస్టు మ్యాచ్‌లను ప్రవేశపెట్టనున్న ఐసీసీతో నేను విబేదిస్తున్నా. ఎందుకంటే నా దృష్టిలో ఐదు రోజుల మ్యాచ్‌లే గొప్పవిగా కనిపిస్తాయి. మనం ఐదు రోజుల టెస్టుల్లోనే ఎన్నో ఉత్కంఠబరితమైన మ్యాచుల్ని చూశాం. ఐసీసీ దానిని అలాగే వదిలేస్తే బాగుంటుదనేది నా అభిప్రాయం. కానీ ఇప్పుడు ఐసీసీ దానిని ఎందుకు మార్చాలనుకుంటుందో అర్థం కావడం లేదని' స్టీవ్ వా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment