
సాక్షి, స్పోర్ట్స్ : బీసీసీఐ సెలక్షన్ కమిటీపై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు శిఖర్ ధావన్‌ను పక్కనపెట్టడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. బోర్డు చేతిలో ప్రతీసారి ధావన్ బలిపశువు అవుతున్నాడంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ధావన్ మెడపై ఎప్పుడూ కత్తి వేలాడుతూనే ఉంటుంది. జట్టులో అతడో బలిపశువుగా మారాడు’’ అని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడిని జట్టు నుంచి పంపించడానికి ఒక్కే ఒక్క చెత్త ప్రదర్శన చాలని ఆయన అన్నారు. ఇక భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మ ఎలా వచ్చాడో? ఎందుకు వచ్చాడో? తనకు అర్థం కావడం లేదని గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేప్‌టౌన్ టెస్టులో తొలి రోజు మూడు వికెట్లు తీసిన భువీని పక్కన పెట్టి ఇషాంత్‌ను తీసుకోవడం ఏంటని సెలక్టర్లను ప్రశ్నించాడు. ఒకవేళ ఇషాంత్‌నే తీసుకోవాలనుకుంటే షమీనో, బుమ్రానో తప్పించి ఉండాల్సిందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
కాగా, దక్షిణాఫ్రికాతో శనివారం ప్రారంభమైన రెండో టెస్టు కోసం భారత్ మూడు మార్పులు చేసింది. శిఖర్ ధవన్ స్థానంలో కేఎల్ రాహల్‌ను, భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా ప్లేస్‌లో పార్థివ్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక మొదటి టెస్ట్ సందర్భంగా రహానేను పక్కనపెట్టి రోహిత్ శర్మను తీసుకోవటంపై కూడా విమర్శలు వినిపించినవ విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment