
అనురాగ్ అవుట్!
న్యూఢిల్లీ:లోధా కమిటీ సిఫారుసుల అమల్లో వెనకడుగు వేస్తూ వచ్చిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు సుప్రీంకోర్టు దిమ్మ తిరిగే షాకిచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఈ కేసును ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సుప్రీం.. సోమవారం ఎట్టకేలకు తుది తీర్పును ప్రకటించింది.
లోధా కమిటీ సిఫారుసుల అమలు చేయకపోవడమే కాకుండా, ఆ సిఫారుసులను అడ్డుకునేందుకు అనురాగ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని ఆశ్రయించారంటూ అతనిపై పిటిషన్ దాఖలైంది. బీసీసీఐలో ‘కాగ్’ అధికారి నియామకం ప్రభుత్వ జోక్యం కిందికి వస్తుందని తెలుపుతూ లేఖ రాయాలని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్‌ను ఠాకూర్ కోరినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. అయితే అనురాగ్ దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. దాంతో డిసెంబర్ 16వ తేదీన విచారణలో అనురాగ్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును ఈరోజు విచారించిన తరువాత బోర్డు అధ్యక్షుడు అనురాగ్, కార్యదర్శి షిర్కేలపై వేటు వేసింది. లోధా కమిటీ సిఫారుసులు అమలు చేయనందుకు ఆ ఇద్దర్ని బోర్డు నుంచి తొలగిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది.
లోధా కమిటీ సిఫారుసులను కచ్చితంగా అమలు చేయాల్సేందేనంటూ సుప్రీంకోర్టు పదే పదే చెప్పినా, వాటిని బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ మాత్రం సీరియస్గా తీసుకోలేదు. ప్రధానంగా కూలింగ్ ఆఫ్ పిరియడ్, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అనే లోధా సిఫారుసును వ్యతిరేకిస్తూ వచ్చారు. లోధా పేర్కొన్న కొన్ని సిఫారుసులను అమలు చేయడం కష్టసాధ్యమంటూ చెబుతూ వచ్చారు. దాంతో సుప్రీంకోర్టు ఎట్టకేలకు బీసీసీఐ కొరడా ఝుళిపించింది. ఈ మేరకు బోర్డులో ప్రధాన పదవుల్లో ఉన్న అనురాగ్, షిర్కేలను తొలగిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే వీరిస్థానంలో కొత్త వారిని సుప్రీంకోర్టు ఎంపిక చేసే అవకాశాలు కనబడుతున్నాయి.