
బీసీసీఐకి సుప్రీం అల్టిమేటం
న్యూఢిల్లీ:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రక్షాళన కోసం లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయకపోతే ఏకంగా బోర్డునే మార్చాల్సి వస్తుందంటూ సుప్రీం అల్టిమేటం జారీ చేసింది. ఆ ప్రతిపాదనలను రేపటిలోగా అమలు చేయాలంటూ బోర్డుకు తుది గడువు ఇచ్చింది.
ఈ మేరకు గురువారం లోధా కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీం.. బీసీసీఐ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా మధ్యాహ్నం గం.2.00ని.లకు తిరిగి మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. బీసీసీఐ వైఖరి సరైనది కాదంటూ పేర్కొంది. లోధా ప్యానల్ ప్రతిపాదనల్ని అమలు చేస్తామంటూ రాతపూర్వక పూచీకత్తును సమర్పించాలని సుప్రీం స్పష్టం చేసింది.
ఈరోజు విచారణలో భాగంగా బీసీసీఐలో ప్రక్షాళన తీసుకొచ్చేందుకు లోధా ప్యానెల్ ప్రతిపాదనలు సూచిస్తే వాటిని అమలు చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని మండిపడింది. దీనిలో భాగంగా బీసీసీఐ అనుబంధ రాష్ట్ర అసోసియేషన్లకు రూ.400 కోట్ల రూపాయల్ని బదిలీ చేయడాన్ని తప్పుబట్టింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో పారదర్శకత విధానం ఉన్నట్లయితే రాత్రికి రాత్రి ఆ నిధులను ఎలా బదిలీ చేస్తారంటూ సుప్రీం ప్రశ్నించింది. అసలు బీసీసీఐలో ఉన్న వారి అర్హత ఏమిటో చెప్పాలంటూ విచారణ సందర్భంగా జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు.