
సుశీల్ ను తప్పించలేదు: డబ్ల్యూఎఫ్ఐ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ కు రెజ్లర్ సుశీల్ కుమార్ కు మొండిచేయి చూపారని వచ్చిన వార్తలను భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) తోసిపుచ్చింది. ఒలింపిక్స్ ప్రాబబుల్స్ కు తాము ఎటువంటి జాబితా పంపించలేదని స్పష్టం చేసింది. రియో ఒలింపిక్స్ జాబితా నుంచి సుశీల్ కుమార్ ను తప్పించలేదని తెలిపింది. రియో ఒలింపిక్స్ ప్రాబబుల్స్ లో రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో సుశీల్ కు చోటు దక్కలేదని, నర్సింగ్ యాదవ్ వైపు రెజ్లింగ్ సమాఖ్య మొగ్గు చూపిందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.
అయితే భారత్ ఒలింపిక్స్ సంఘానికి తాము ఎటువంటి జాబితా పంపించలేదని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. ఒలింపిక్స్ లో వివిధ కేటగిరీల్లో పోటీ పడే అవకాశమున్న క్రీడాకారుల పేర్ల జాబితాను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనే సంస్థ పంపిస్తుంటుందని వివరణయిచ్చారు. సుశీల్ కుమార్ కు దారులు పూర్తిగా మూసుకుపోలేదన్నారు. భారత్ ఒలింపిక్స్ సంఘం ఎవరి పేరుకు ఖరారు చేస్తే వారే దేశం తరపున పోటీకి వెళతారని డబ్ల్యూఎఫ్ఐ సహ కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు.