సఫారీలపై ఇంగ్లాండ్ రికార్డు విజయం
ముంబై: టీ20 క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికా విసిరిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించి.. అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రెండవ జట్టుగా రికార్డు సృష్టంచింది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో గేల్ విజృంభించడంతో భారీ స్కొరును కాపాడుకోలేకపోయిన ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్లో పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు తొలి ఓవర్ నుంచే పరుగుల వరద పారించారు. ఓపెనర్ జేజే రాయ్(16 బంతుల్లో 43) దాటిగా ఆడాడు. హేల్స్(17), స్టోక్స్(15) వికెట్లను త్వరగానే కొల్పోయినా.. జో రూట్(44 బంతుల్లో 83 పరుగులు) అద్భుతమైన ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. రూట్కు బట్లర్(14 బంతుల్లో 21), మోర్గాన్, అలీ సహకారం అందించారు. చివరి ఓవర్లో ఒక పరుగు చేయాల్సిన సమయంలో రెండు వికెట్లు కోల్పోయి కొంచెం తడబడినా మోయిన్ అలీ లాంచనాన్ని పూర్తిచేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్కు మూడు వికెట్లు దక్కగా.. రబడకు రెండు, డుమిని, తాహిర్లకు ఒక్కో వికెట్ దక్కింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. ఓపెనర్లు హషిమ్ ఆమ్లా(31 బంతుల్లో 58 పరుగులు), డికాక్(24 బంతుల్లో 52 పరుగులు) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. అనంతరం స్వల్ప వ్యవధిలో ఓపెనర్ల వికెట్లను కోల్పోవడంతో స్కోరు కాస్త నెమ్మదించింది. డివిలియర్స్(16), డుప్లిసిస్(17) దాటిగా ఆడే ప్రయత్నంలో త్వరగా పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన డుమిని(28 బంతుల్లో 54 పరుగులు), మిల్లర్(12 బంతుల్లో 28) చివర్లో దాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అలీకి 2 వికెట్లు దక్కగా.. విల్లీ, రషీద్లకు చెరో వికెట్ దక్కింది.