
విరాట్-రహానేల దూకుడు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అజింక్యా రహానేల జోడి దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అజింక్యా రహానేల జోడి దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. మూడో రోజు ఆటలో భాగంగా శనివారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తడబడిన సమయంలో విరాట్-రహానే జోడి ఆదుకుంది. ఈ క్రమంలోనే విరాట్(72 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ చేయగా, రహానే(40 బ్యాటింగ్) మరోసారి చక్కటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ జోడి అజేయంగా 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 72 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఇప్పటివరకూ 380 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
ఈ రోజు ఆటలో ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా.. ఆ తరువాత తేరుకుంది. శిఖర్-పూజారాల జోడి కుదురుగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా నిలదొక్కుకుంది. కాగా, 45 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన ఈ జోడి లంచ్ తరువాత నాలుగు పరుగుల వ్యవధిలో నిష్క్రమించడంతో టీమిండియా జట్టులో కలవరం మొదలైంది. అయితే అటు తరువాత విరాట్ , రహానేలు కుదురుగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించడంతో తిరిగి టీమిండియా గాడిలో పడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహీర్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 334 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 121 పరుగులకు ఆలౌటయ్యింది. ఇప్పటికే విరాట్ సేన భారీ ఆధిక్యంలో నిలవడంతో పాటు, ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో సఫారీలకు మరోసారి సవాల్ గా మారనుంది.