
శిఖర్ ధవన్- విరాట్ కోహ్లీ
హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవశం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది. 243 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా సునాయాసంగా గెలుపొందింది. భారత ఓపెనర్లు అజ్యింకా రహానే, శిఖర్ ధవన్ లు జట్టుకు శుభారంభాన్నిచ్చారు. రహానే(31) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరినా..ధవన్ మరోసారి చక్కటి ఆటతో ఆకట్టుకున్నాడు.
తృటిలో సెంచరీ చేజార్చుకున్న ధవన్ (91; 79 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అంబటి రాయుడి (35) పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం భారత కెప్టెన్ కోహ్లీ (53), సురేష్ రైనా(18 *) పరుగులు చేసి మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చారు. చివర్లో సాహా (11) పరుగులు చేసి మ్యాచ్ ను ముగించాడు. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 44.1 ఓవర్లో లక్ష్యాన్ని సాధించింది. శ్రీలంక బౌలర్లలో కులశేఖర, పెరీరా, దిల్షాన్ లకు తలో వికెట్టు దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను మహేలా జయవర్ధనే, దిల్షాన్ లు ఆదుకున్నారు. ఐదు పరుగుల వద్ద కుశల్ పెరీరా (4) వికెట్టును కోల్పోయిన లంకేయులు వెంటనే సంగక్కరా వికెట్టును కూడా చేజార్చుకుంది. జయవర్ధనే సెంచరీ, దిల్షాన్ అర్ధ సెంచరీలతో బయటపడ్డ లంకేయులు 48.2 ఓవర్లలో 242 పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించగా, ఏఆర్ పటేల్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.