
జయవర్ధనే, దిల్షాన్ లు హాఫ్ సెంచరీలు
హైదరాబాద్:టీమిండియాతో ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఆటగాళ్లు మహేలా జయవర్ధనే, దిల్షాన్ లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన లంకను వీరిద్దరూ ఆదుకున్నారు. ఐదు పరుగుల వద్ద కుశల్ పెరీరా (4) వికెట్టును కోల్పోయిన లంకేయులు వెంటనే సంగక్కరా వికెట్టును కూడా చేజార్చుకుంది. కుమార సంగక్కరా(0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరి లంక అభిమానుల్ని నిరాశ పరిచాడు. అనంతరం దిల్షాన్(53)పరుగులు చేసి మూడు వికెట్టు రూపంలో వెనుదిరిగగా, జయవర్ధనే(76)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీలంక 34.5 ఓవరల్లో 154 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జయవర్ధనే జతగా డిసిల్వా క్రీజ్ లో ఉన్నాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, ఏఆర్ పటేల్ లు తలో రెండు వికెట్లు తీసి లంక పతనానికి పునాది వేశారు. ఐదు వన్డేల్లో భాగంగా గత రెండు వన్డేల్లో ఒటమి పాలైన లంకేయులు ఈ మ్యాచ్ ను గెలిచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని భావిస్తుండగా, టీమిండియా మాత్రం ఈ మ్యాచ్ లో కూడా విజయ ఢంకా మోగించి సిరీస్ ను కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది.