రాత మార్చిన కప్ | the cup that changed the fate | Sakshi
Sakshi News home page

రాత మార్చిన కప్

Published Tue, Mar 11 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM

రాత మార్చిన కప్

రాత మార్చిన కప్

ఎవరు ఊహించారు టి20 ఫార్మాట్ ఇంతగా ప్రజాదరణ పొందుతుందని... ఎవరు అనుకున్నారు కుర్రాళ్ల ఆట ఇంతగా అభిమానులను కట్టి పడేస్తుందని... బంగారు పళ్లానికి కూడా గోడవాటం కావాలి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ విషయాన్ని చాలా తొందరగా గుర్తించింది. కౌంటీల్లో టైమ్‌పాస్‌గా కనిపించిన టి20కి క్రేజ్ పెంచాలంటే ఎక్కువ దేశాలను అందులో భాగం చేయాలి. ప్రపంచ కప్ నిర్వహణే అందుకు తగిన వేదిక. ఆటలు, పాటలతో కొత్త తరహా వినోదాన్ని అభిమానులకు చేరువ చేయడం, తద్వారా తక్కువ వ్యవధిలో తమ ఆదాయం కూడా పెంచుకోవడం ఐసీసీ ఆలోచన. దాని ఫలితమే టి20 ప్రపంచకప్.

వెస్టిండీస్‌లో 2007 వన్డే వరల్డ్ కప్ నిర్వహణ ఐసీసీకి చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. ఒకటి, రెండని కాదు, ఎన్నో అంశాలు ఐసీసీ ప్రతిష్టను దెబ్బ తీశాయి. వెస్టిండీస్‌లాంటి స్వేచ్ఛాయుత దేశంలో ప్రేక్షకుల అనుమతిపై అనేక ఆంక్షలు,సుదీర్ఘంగా సాగిన టోర్నీ అభిమానులకు విసుగెత్తించాయి. ఇక వెలుతురులేమి మధ్య ఫైనల్ మ్యాచ్ నిర్వహణ ఒక పెద్ద ప్రహసనంగా నిలిచిపోయింది. సరిగ్గా చెప్పాలంటే అత్యంత చెత్త వరల్డ్ కప్‌గా అది నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అభిమానులకు వినోదం అందించాలనే ఏకైక లక్ష్యంతో టి20 వరల్డ్ కప్ ఆలోచన మొగ్గ తొడిగింది. వన్డే తరహాలో కాకుండా రెండేళ్లకు ఒకసారి దీనిని నిర్వహించాలని ఐసీసీ భావించింది.
 
20వ మ్యాచ్‌తో 20-20....
 సెప్టెంబర్ 11, 2007...పొలాక్ బౌలింగ్‌లో తొలి బంతిని క్రిస్ గేల్ పాయింట్ దిశగా ఫోర్ కొట్టడంతో తొలి ప్రపంచ కప్‌కు బోణీ జరిగింది.  మరో 13 రోజుల తర్వాత ఇదే మైదానంలో మిస్బావుల్ హక్ స్కూప్ షాట్‌ను ఆడటంలో విఫలమై భారత్ చేతిలో ప్రపంచ కప్ పెట్టడంతో దీనికి ముగింపు లభించింది. ఈ మధ్య కాలంలో టోర్నీ పంచిన వినోదంతో టి20 చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వరల్డ్ కప్‌కు ముందు 19 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. అయినా సరే ఈ ప్రయోగం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. తొలి టోర్నీ సక్సెస్‌తో ఆ తర్వాత ఐపీఎల్‌కు అంకురార్పణ జరిగి ప్రపంచంలో టి20కి ఎనలేని క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. పొట్టి ఫార్మాట్ ఇంతగా ప్రభావం చూపిస్తుందని బహుశా ఆనాడు ఐసీసీ కూడా ఊహించి ఉండదు.
 
12 జట్లతో...
 తొలి టి20 వరల్డ్ కప్‌లో 10 టెస్టు దేశాలతో పాటు అర్హత టోర్నీ ద్వారా కెన్యా, స్కాట్లాండ్‌లకు కూడా అవకాశం కల్పించారు. మొత్తం జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. పాయింట్లలో ముందంజలో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్లోకి పవేశించాయి. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. తొలి సెమీస్‌లో కివీస్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి పాకిస్థాన్...మరో సెమీస్‌లో ఆస్ట్రేలియాను 15 పరుగులతో ఓడించి భారత్ తుది పోరుకు అర్హత సాధించాయి.
 
 హోరాహోరీ
 వన్డేల్లో ఎనిమిది ప్రపంచ కప్‌లు జరిగినా....చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశం ఎప్పుడూ రాలేదు. టి20 వరల్డ్ కప్ తొలి టోర్నీకి ఇంతకంటే మంచి ముగింపు ఏముంటుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్, గంభీర్ (75) అర్ధ సెంచరీతో పాటు, రోహిత్ శర్మ (30 నాటౌట్) రాణింపుతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి 5.3 ఓవర్లలోనే 53 పరుగులు చేసి పాక్ దూకుడు మీద కనిపించింది. అయితే ఉతప్ప అద్భుత ఫీల్డింగ్‌కు ఇమ్రాన్ నజీర్ రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ఆర్పీ సింగ్ (3/26), ఇర్ఫాన్ పఠాన్ (3/16) కట్టడి చేసినా... కడదాకా పోరాడిన మిస్బా (43 నాటౌట్)... చివర్లో ఆడిన ఒక్క షాట్ భారత్‌ను విజేతగా నిలిపింది. జోగీందర్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన దశలో ఫైన్ లెగ్ వైపు మిస్బా స్కూప్ ఆడాడు. గాల్లో లేచిన బంతిని శ్రీశాంత్ అందుకోవడంలో భారత్ చేతికి వరల్డ్ కప్ చిక్కింది. ఆ ఓవర్‌తో జోగీందర్ చరిత్రలో నిలిచిపోయాడు.
 
 ధోని ధమాకా
 టి20 ప్రపంచ కప్‌కు ముందు ఏ మాత్రం అంచనాలు లేని జట్లలో భారత్ కూడా ఒకటి. ఇంగ్లండ్ జట్టు ప్రత్యేకంగా టి20 స్పెషలిస్ట్‌లనే ఎంపిక చేయగా, ఆసీస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల్లో అప్పటికే టి20 మ్యాచ్‌లు జోరందకున్నాయి. అంతకు దాదాపు 9 నెలల ముందు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ తమ ఏకైక టి20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడి గెలిచింది. అయితే సరిగ్గా ఈ టోర్నీకి ముందు ఇది కుర్రాళ్ల ఆట...30 ప్లస్ వాళ్లకు అనవసరం అంటూ ముగ్గురు దిగ్గజాలు సచిన్, గంగూలీ, ద్రవిడ్ తమను జట్టు ఎంపికలో పరిగణించవద్దని చెప్పేశారు.

ఆ సమయంలో ధోనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పాలని సచిన్ సూచించడం భారత క్రికెట్ దిశను మార్చేసింది. ఈ యువ జట్టును ధోని సమర్ధంగా నడిపించాడు. సగటు వయసు 24గా ఉన్న ఈృబందం సమష్టిగా రాణించి 24 ఏళ్ల తర్వాత భారత్‌కు వరల్డ్ కప్ విజయాన్ని అందించింది. ధోని కంటే సీనియర్లు సెహ్వాగ్, యువరాజ్, హర్భజన్ జట్టులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా కెప్టెన్ తొలి టోర్నీలో జట్టును గెలిపించగలిగాడు. ఒక్క బంతి కూడా పడకుండా స్కాట్లాండ్‌తో తొలి మ్యాచ్ రద్దు కాగా, పాక్‌పై బౌల్డ్ అవుట్‌తో ధోని విజయాల ఖాతా తెరిచాడు. అనంతరం సూపర్ ఎయిట్ దశలో కివీస్ చేతిలో పరాజయం ఎదురైంది. అయితే చక్కటి ఆటతో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలను ఓడించి భారత్ సెమీస్‌కు చేరింది. ఆ తర్వాత సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో పాక్‌పై గెలుపు టీమిండియాకు ఆనందాన్ని మిగిల్చింది.
 
 విశేషాలు...
స్కోర్లు సమమైనప్పుడు బౌల్ అవుట్ పద్ధతి ద్వారా విజేతను తేల్చారు. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లోనే ఇది ఉపయోగించడం విశేషం. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ను బౌల్ అవుట్‌తో భారత్ నెగ్గింది. ఆ తర్వాతి కాలంలో దీనిని తొలగించి సూపర్ ఓవర్‌ను చేర్చారు.

  • క్రిస్ గేల్ టి20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు.
  • బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ సింగ్ అత్యధిక పరుగుల రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో అతను 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేయడం మరో రికార్డు.
  • బ్రెట్‌లీ తొలి హ్యాట్రిక్ (బంగ్లాదేశ్‌పై) నమోదు చేశాడు.
  • శ్రీలంక చేతిలో కెన్యా 172 పరుగుల తేడాతో చిత్తుగా ఓడటం ఇప్పటికీ ప్రపంచ రికార్డే.
  • ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో జింబాబ్వే నెగ్గడం పెద్ద సంచలనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement