'పుణే'ను కాపాడుకోవాలి! | today second ODI against New Zealand | Sakshi
Sakshi News home page

'పుణే'ను కాపాడుకోవాలి!

Published Wed, Oct 25 2017 12:07 AM | Last Updated on Wed, Oct 25 2017 3:28 AM

 today second ODI against New Zealand

ఇటీవలి కాలంలో సిరీస్‌ను రక్షించుకోవాల్సిన స్థితిలో భారత జట్టు మ్యాచ్‌ బరిలోకి దిగిన దాఖలాలు దాదాపుగా లేవు. సొంతగడ్డపై నాలుగేళ్లుగా మన జట్టు ఒకే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఎప్పుడూ ఓడిపోలేదు కూడా. కానీ బుధవారం ఆ ప్రమాదం కనిపిస్తోంది. అలవోకగా తలవంచుతుందనుకున్న ప్రత్యర్థి న్యూజిలాండ్‌ గత మ్యాచ్‌లో ఇచ్చిన అనూహ్య షాక్‌తో ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. సిరీస్‌ చేజారిపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా గెల వాల్సిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఒత్తిడిని అధిగమించి అన్ని రకాలుగా చెలరేగాల్సి ఉంటుంది.

ముంబై వన్డే చూస్తే న్యూజిలాండ్‌ జట్టు ఈ సిరీస్‌ కోసం మంచి హోంవర్క్‌ చేసి వచ్చిందని అర్థమైపోయింది. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు స్వీప్‌ షాట్లను సమర్థంగా ఉపయోగించడంతో పాటు తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కూడా కీలక మార్పులు చేసి ఆ జట్టు ఫలితం సాధించింది. సమష్టితత్వంతో తొలి వన్డే గెలుచుకున్న కివీస్‌ ఇప్పుడు సిరీస్‌ గెలుపుపై దృష్టి పెట్టింది. విదేశీ గడ్డపై అరుదుగా వచ్చిన ఈ అవకాశాన్ని కోల్పోరాదని ఆ జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పుణేలో భారత్‌ పరువు దక్కుతుందా లేక కివీస్‌ చరిత్ర సృష్టిస్తుందా చూడాలి.   

పుణే: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఊహించని విధంగా వెనుకబడిన భారత్‌ చావో రేవో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇక్కడి ఎంసీఏ మైదానంలో నేడు జరిగే రెండో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ గెలిస్తే భారత్‌ 1–1తో సమం చేసి సిరీస్‌లో నిలుస్తుంది. అయితే గత మ్యాచ్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న కివీస్‌ కూడా మరో గెలుపుపై దృష్టి పెట్టింది. రెండు జట్లు కూడా మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది.  

ఆర్డర్‌ మారుతుందా...
తొలి వన్డేలో కోహ్లి సెంచరీ తప్ప భారత బ్యాటింగ్‌ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. కనీసం మరో అర్ధ సెంచరీ లేకుండా దాదాపు అందరూ విఫలమయ్యారు. ఫలితంగా భారీ స్కోరు సాధ్యం కాక జట్టుకు ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లోనైనా ఆ తప్పును వారు దిద్దుకోవాల్సి ఉంది. ఓపెనర్లు రోహిత్, ధావన్‌ల నుంచి జట్టు శుభారంభం ఆశిస్తోంది. మిడిలార్డర్‌లో దినేశ్‌ కార్తీక్, ధోని కొద్దిసేపు నిలబడినా... అది సరిపోలేదు. పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చడం జట్టుకు ఎంతో అవసరం.  అయితే కీలకమైన నాలుగో స్థానంలో కేదార్‌ జాదవ్‌ను పంపించిన ప్రయోగం విఫలమైంది. ముఖ్యంగా సొంతగడ్డపై జరగనున్న ఈ మ్యాచ్‌ జాదవ్‌కు ఎంతో కీలకం. ఈ ఏడాది జనవరిలో పుణే స్టేడియంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఏకంగా 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో మెరుపు వేగంతో 76 బంతుల్లోనే 120 పరుగులు చేసి జాదవ్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత అతను మరో 23 మ్యాచ్‌లు ఆడినా ఎక్కడా తన ముద్ర చూపించలేకపోయాడు. ఇప్పటికే టి20 టీమ్‌లో చోటు కోల్పోయిన అతను వన్డేల్లో కొనసాగాలంటే ఇప్పుడు బాగా ఆడాల్సిందే. అందుకోసం సొంత మైదానానికి మించిన వేదిక అతనికి దొరకదు! మొదటి వన్డేలో భువనేశ్వర్, బుమ్రా మెరుగ్గానే బౌలింగ్‌ చేసినా... కివీస్‌ ఓపెనర్లు వారిని సమర్థంగా ఎదుర్కోవడంతో ఫలితం దక్కలేదు. మరోవైపు వరుసగా భారత్‌ను గెలిపిస్తూ వచ్చిన స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌ హవా కూడా పని చేయలేదు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకునేందుకు వీరిద్దరు కొత్త తరహా వ్యూహంతో సిద్ధం కావాల్సి ఉంది. మొత్తంగా ఒత్తిడి భారత్‌పైనే ఉందనేది వాస్తవం.

అరుదైన అవకాశం...
సరిగ్గా సంవత్సరం క్రితం భారత్‌లో పర్యటించిన న్యూజిలాండ్‌ జట్టు ఒక దశలో ఐదు వన్డేల సిరీస్‌లో 2–2తో సమంగా నిలిచింది. చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ వైఫల్యంతో ఆ జట్టు సిరీస్‌ కోల్పోయింది కానీ నాడు కూడా జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా రాణించారు. ఇప్పుడు ఆ అనుభవం వారికి చాలా వరకు ఉపయోగపడిందని గత మ్యాచ్‌ హీరో టామ్‌ లాథమ్‌ అభిప్రాయపడ్డాడు. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు మిడిలార్డర్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అతను చెప్పాడు. వారి ప్రణాళిక ముంబై మ్యాచ్‌లో చాలా బాగా పని చేసింది. మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా కివీస్‌ ఏమాత్రం కలవరపడకుండా ప్రశాంతంగా విజయం దిశగా వెళ్లడం ఆ జట్టు పట్టుదలను సూచిస్తోంది. లాథమ్, టేలర్‌లతో పాటు ఓపెనర్లు గప్టిల్, మున్రో కూడా మెరుగ్గానే ఆడారు. కెప్టెన్‌ విలియమ్సన్‌ విఫలమైనా అతనిలాంటి అగ్రశ్రేణి ఆటగాడు ఎప్పుడైనా ఫామ్‌లోకి రావచ్చు. నికోల్స్, హిట్టర్‌ గ్రాండ్‌హోమ్‌లతో జట్టు బ్యాటింగ్‌లో లోతు ఉంది. ఇక బౌలింగ్‌లో బౌల్ట్‌ మరోసారి మన బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు సృష్టించగలడు. ముఖ్యంగా ఓపెనర్లను కట్టి పడేయడంలో అతని పాత్రనే కీలకం. సౌతీ, సాన్‌ట్నర్‌ కూడా మంచి బౌలర్లు కావడంతో కివీస్‌ బలంగానే కనిపిస్తోంది. గత మ్యాచ్‌ జోరును కొనసాగిస్తే ఆ జట్టుకు చిరస్మరణీయ విజయం దక్కుతుంది.  

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌:  కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్, కార్తీక్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా.  
న్యూజిలాండ్‌:  విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోల్స్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్, మిల్నే.

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. బౌండరీలు కూడా చిన్నవి కావడం తో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement