ఆశావహులకు ఆఖరి అవకాశం
నేటి నుంచి దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీ
విశాఖపట్నం: వచ్చే జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో ఎంపికయ్యేందుకు పలువురు క్రికెటర్లకు... దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ రూపంలో ఆఖరి అవకాశం లభించింది. స్థానిక డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ–వీడీసీఏ మైదానంలో ఐదు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో భారత్ ‘రెడ్’, భారత్ ‘బ్లూ’ జట్లతోపాటు విజయ్ హజారే ట్రోఫీ విజేత తమిళనాడు జట్లు బరిలో ఉన్నాయి. శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ నేతృత్వంలోని భారత్ ‘బ్లూ’ జట్టుతో పార్థివ్ పటేల్ సారథ్యంలోని భారత్ ‘రెడ్’ జట్టు తలపడుతుంది.
భారత ‘బ్లూ’ జట్టులో అంబటి తిరుపతి రాయుడు... బొబ్బిలిలో జన్మించి చత్తీస్‌గఢ్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంకజ్ కుమార్ రావు బరిలో ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే చివరి టోర్నీ కావడంతో శిఖర్ ధావన్, మనీశ్ పాండే, మయాంక్ అగర్వాల్, దినేశ్ కార్తీక్ తదితర క్రికెటర్లు సత్తా చాటుకొని సెలక్టర్ల దృష్టిలో పడాలనుకుంటున్నారు.