
చెస్ చాంప్ అర్జున్‌కు సన్మానం
జాతీయ అండర్-13 చెస్ చాంపియన్‌గా నిలిచిన వరంగల్ కుర్రాడు ఎరిగైసి అర్జున్‌ను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) సన్మానించింది.
హైదరాబాద్: జాతీయ అండర్-13 చెస్ చాంపియన్‌గా నిలిచిన వరంగల్ కుర్రాడు ఎరిగైసి అర్జున్‌ను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) సన్మానించింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్‌సీఏ అధ్యక్షుడు ఎ. నరసింహా రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర రావు, సంయుక్త కార్యదర్శి కె. కరుణాకర్ రెడ్డిలు అర్జున్‌ను, అతని కోచ్ రామరాజులను అభినందించారు.
ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో అతను బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. 11 రౌండ్ల ఈ టోర్నీలో ఓటమి అన్నదే ఎరుగని అర్జున్ 9 విజయాలు సాధించాడు. రెండు గేముల్లో డ్రా చేసుకొని 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
5, 6 తేదీల్లో చెస్ టోర్నీ
టీఎస్‌సీఏ ఆధ్వర్యంలో ర్యాపిడ్ చెస్ టోర్నీ ఈ నెల 5, 6 తేదీల్లో జరగనుంది. బేగంపేట్‌లోని ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీలో ఉన్న ఎ9 చెస్ అకాడమీలో ఈ పోటీలు నిర్వహిస్తారు. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 10 వేలు. అండర్-7, 9, 11, 13 విభాగాల్లో విజేతలు, రన్నరప్‌గా నిలిచినవారికి నగదు బహుమతి అందజేస్తారు. ఐదు రౌండ్ల స్విస్ లీగ్ ఫార్మాట్‌లో పోటీలు జరుగుతాయి. మరిన్ని వివరాలకు గుమ్మడి స్రవంతి (99851-55557)ని సంప్రదించవచ్చు.