యువ భారత్ ‘హ్యాట్రిక్’
వరుసగా మూడో విజయం
రాణించిన శామ్సన్, కుల్‌దీప్
అండర్ 19 ప్రపంచకప్
షార్జా: ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో తడబడినా అండర్-19 ప్రపంచ కప్ ప్రధాన టోర్నమెంట్‌లో మాత్రం భారత యువ జట్టు అదరగొడుతోంది. వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయడంతోపాటు గ్రూప్ ‘ఎ’లో టాపర్‌గా నిలిచింది. పసికూన పపువా న్యూ గినియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 245 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ సంజూ శామ్సన్ (48 బంతుల్లో 85, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో 50 ఓవర్లలో 6 వికెట్లకు 301 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ గినియా జట్టు 28.2 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. బ్యాట్‌తో చెలరేగిన శామ్సన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈనెల 22న దుబాయ్‌లో జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.
నిదానంగా మొదలుపెట్టి...
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిదానంగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓపెనర్లు అంకుశ్ బైన్స్(83 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్స్), అఖిల్ హర్వాద్కర్ (40 బంతుల్లో 37; 3 ఫోర్లు, సిక్స్) గినియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. జట్టు స్కోరు 58 పరుగుల దగ్గర హర్వాద్కర్ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విజయ్ జోల్ (68 బంతుల్లో 35) నెమ్మదిగా ఆడాడు. బైన్స్‌తో కలిసి 74 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే వీళ్లిద్దరు కొద్ది పరుగుల తేడాతో అవుటైన తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఈ దశలో శామ్సన్, శ్రేయాస్ అయ్యర్ (38 బంతుల్లో 36; 3 ఫోర్లు) గినియా బౌలర్లను ఆడుకున్నారు. గినియా జట్టు బౌలర్ గెబాయ్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో శామ్సన్ వరుసగా 4, 4, 4, 4, 6, 1 స్కోరు చేశాడు. ఇద్దరూ కలిసి జట్టు స్కోరును 250 దాటించిన తర్వాత అయ్యర్ అవుటయ్యాడు. ఆ తర్వాత శామ్సన్ కూడా వెనుదిరిగాడు. చివర్లో సర్ఫరాజ్ ఖాన్ (19 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) జోరుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ స్కోరు 300 దాటింది.
టపటపా...
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ గినియాను భారత బౌలర్లు హడలెత్తించారు. రెండో ఓవర్ నుంచే గినియా వికెట్ల పతనం మొదలైంది. కుల్‌దీప్ యాదవ్ (4/10), మోను కుమార్ (3/13), దీపక్ హుడా (2/5) దెబ్బకు గినియా ఇన్నింగ్స్ 56 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 74 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై; పాకిస్థాన్ 146 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై; అఫ్ఘానిస్థాన్ 4 వికెట్ల తేడాతో నమీబియాపై గెలిచాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌తో శ్రీలంక (22న); అఫ్ఘానిస్థాన్‌తో దక్షిణాఫ్రికా (23న); ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ (23న) తలపడతాయి.