
మూడేళ్ల తరువాత వన్డేల్లో చోటు
ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖాజా మూడేళ్ల తరువాత వన్డేల్లో పునరాగమనం చేయబోతున్నాడు.
వెల్లింగ్టన్:ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖాజా మూడేళ్ల తరువాత వన్డేల్లో పునరాగమనం చేయబోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా ఆడిన టెస్టు సిరీస్ ల్లో విశేషంగా రాణించిన ఖాజాకు న్యూజిలాండ్ జరుగనున్న రెండో వన్డేలో చోటు కల్పించారు. శనివారం జరిగే రెండో వన్డేలో ఖాజాకు తుది జట్టులో అవకాశం దక్కింది. చివరిసారి 2013లో వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ ఆడిన ఖాజా.. ఆ తరువాత వన్డేల్లో చోటు కోల్పోయాడు.
దీనిపై ఖాజా మాట్లాడుతూ.. ఇది తనకు సరికొత్త ఛాలెంజ్ గా అభివర్ణించాడు. గతాన్ని మరిచిపోయి బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను రెట్టించిన ఉత్సాహంతో ఉన్నట్లు తెలిపాడు. తన శక్తివంచన లేకుండా జట్టు విజయం కోసం కృషి చేస్తానన్నాడు. కాగా, తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఓటమి పాలై సిరీస్ లో వెనుకబడిన సంగతి తెలిసిందే.