ఒకే ఒక్కడు... 16 రికార్డులు | Venkat Rahul sensation of weightlifter | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు... 16 రికార్డులు

Published Fri, Sep 8 2017 12:41 AM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

ఒకే ఒక్కడు... 16 రికార్డులు

ఒకే ఒక్కడు... 16 రికార్డులు

వెయిట్‌లిఫ్టర్‌ రాగాల వెంకట్‌ రాహుల్‌ సంచలనం
కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు
రాహుల్‌ తమ్ముడు వరుణ్‌కు కూడా పసిడి పతకం


గోల్డ్‌ కోస్ట్‌ (ఆస్ట్రేలియా): గతంలో జూనియర్‌స్థాయిలో కనబరిచిన ప్రదర్శనను సీనియర్‌స్థాయిలోనూ పునరావృతం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌లిఫ్టర్‌ రాగాల వెంకట్‌ రాహుల్‌ సంచలనం సృష్టించాడు. కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ గుంటూరు జిల్లా లిఫ్టర్‌ ఒకే రోజు 16 రికార్డులను సవరించడం విశేషం. సీనియర్, జూనియర్‌ పురుషుల 85 కేజీల విభాగాలలో బరిలోకి దిగిన రాహుల్‌ రెండు విభాగాల్లోనూ స్నాచ్‌లో 156 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 195 కేజీల బరువెత్తి ఓవరాల్‌గా 351 కేజీలతో విజేతగా నిలిచి రెండు స్వర్ణ పతకాలను దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శనతో వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌కు రాహుల్‌ అర్హత సాధించాడు.  


స్నాచ్‌లో 156 కేజీలు ఎత్తిన రాహుల్‌ సీనియర్‌ స్థాయిలో వికాస్‌ ఠాకూర్‌ (155 కేజీలు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో రెండు ప్రయత్నాల్లో 189 కేజీలు, 195 కేజీలు ఎత్తి సీనియర్‌ స్థాయిలో తన పేరిటే (188 కేజీలు) ఉన్న రికార్డును సవరించాడు. మొత్తం విభాగంలో రెండు ప్రయత్నాల్లో 345 కేజీలు, 351 కేజీలు ఎత్తిన రాహుల్‌ 341 కేజీలతో తన పేరిటే ఉన్న రికార్డును అధిగమించాడు.  ఇక జూనియర్‌ విభాగంలో రాహుల్‌ ఆరు రికార్డులు సవరించాడు. స్నాచ్‌లో రెండు ప్రయత్నాల్లో 152 కేజీలు, 156 కేజీలు ఎత్తి వికాస్‌ ఠాకూర్‌ (150 కేజీలు) పేరిట ఉన్న రికార్డును దాటేశాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో రెండు ప్రయత్నాల్లో 189 కేజీలు, 195 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న (188 కేజీలు) రికార్డును అధిగమించాడు. మొత్తం విభాగంలో రెండు ప్రయత్నాల్లో 341 కేజీలు, 351 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న (338 కేజీలు) ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.  

ఇక కామన్వెల్త్‌ జూనియర్‌స్థాయిలో రాహుల్‌ ఐదు రికార్డులు అధిగమించాడు. స్నాచ్‌లో 156 కేజీలు ఎత్తి బోడీ సాంటవీ (కెనడా–152 కేజీలు) పేరిట ఉన్న రికార్డును దాటాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో రెండు ప్రయత్నాల్లో 189 కేజీలు, 195 కేజీలు ఎత్తి స్టీవెన్‌ కరి (పాపువా న్యూగినియా–185 కేజీలు) రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం విభాగంలో రెండు ప్రయత్నాల్లో 345 కేజీలు, 351 కేజీలు బరువెత్తి కొజుమ్‌ తాబా (భారత్‌–330 కేజీలు) పేరిట ఉన్న రికార్డును సవరించాడు.

రాహుల్‌ సోదరుడు రాగాల వరుణ్‌ జూనియర్‌ బాలుర 77 కేజీల విభాగంలో బరిలోకి దిగి స్నాచ్‌లో 124 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 145 కేజీలు ఎత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సీనియర్‌ పురుషుల 77 కేజీల విభాగంలో సతీశ్‌ (320 కేజీలు) స్వర్ణాన్ని అందించాడు. జూనియర్‌ పురుషుల 77 కేజీల విభాగంలో అజయ్‌ సింగ్‌ (310 కేజీలు)... జూనియర్‌ మహిళల 69 కేజీల విభాంలో నిరుపమా దేవి (178 కేజీలు)... యూత్‌ బాలికల 69 కేజీల విభాగంలో నికిత (163 కేజీలు) భారత్‌కు పసిడి పతకాలు అందించారు. యూత్‌ బాలుర 77 కేజీల విభాగంలో అభిషేక్‌ (256 కేజీలు) కాంస్య పతకాన్ని గెలుపొందాడు. ఓవరాల్‌గా గురువారం భారత్‌కు 7 స్వర్ణాలు, ఒక కాంస్యం లభించాయి.

రాహుల్‌ - వరుణ్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement