విజేందర్ శుభారంభం
అల్మాటీ (కజకిస్థాన్): డ్రగ్స్ వివాదం నేపథ్యంలో కొన్నాళ్లపాటు ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ హర్యానా బాక్సర్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల 75 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్‌లో విజేందర్ 3-0తో (30-27, 30-26, 30-26) హ్యాంపస్ హెన్రిక్సన్ (స్వీడన్)పై గెలిచాడు. 2009 ఈవెంట్‌లో విజేందర్ కాంస్య పతకం నెగ్గి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన భారత తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. ‘ఇక్కడకు వచ్చినప్పటి నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాను. రెండు రోజులుగా మందులు వాడుతున్నాను.
తొలి రౌండ్‌లో గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. శారీరకంగా బలహీనంగా ఉన్నా మానసికంగా దృఢంగా ఉండాలని ఈ బౌట్‌కు ముందు కోచ్‌లు చెప్పారు.
నేను సానుకూల దృక్పథంతో బరిలోకి దిగి విజయాన్ని అందుకున్నాను ’ అని విజేందర్ వ్యాఖ్యానించాడు. శనివారం జరిగే రెండో రౌండ్‌లో యూరోపియన్ చాంపియన్ జాసన్ క్విగ్లీ (ఐర్లాండ్)తో విజేందర్ పోటీపడనున్నాడు. శుక్రవారం జరిగే పోటీల్లో ఇద్దరు భారత బాక్సర్లు బరిలోకి దిగనున్నారు. కెడ్డీ ఆగ్నెస్ (సీషెల్స్)తో మన్‌ప్రీత్ (91 కేజీలు); ఫాతి కెలెస్ (టర్కీ)తో మనోజ్ కుమార్ (64 కేజీలు) తలపడతారు.