
20 ఏళ్ల తరువాత టీమిండియా..
ఇంగ్లండ్తో జరుగుతున్న నాల్గో టెస్టులో భారత్ క్రికెట్ జట్టు మరో రికార్డు సాధించింది.
ముంబై: ఇంగ్లండ్తో జరుగుతున్న నాల్గో టెస్టులో భారత్ క్రికెట్ జట్టు మరో రికార్డును సవరించింది శుక్రవారం మూడో రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పలు అరుదైన ఘనతలను సొంతం చేసుకోగా, నాల్గో రోజు ఆటలో మరో రికార్డులో భాగస్వామ్యం అయ్యాడు. బ్యాటింగ్ ఆల్ రౌండర్ జయంత్ యాదవ్తో కలిసి ఎనిమిదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యాన్ని లిఖించాడు. ఈ జోడి 161 పరుగులకు పైగా భాగస్వామ్యం సాధించారు. తద్వారా గతంలో భారత్ తరపున మొహ్మద్ అజహరుద్దీన్-అనిల్ కుంబ్లేలు నమోదు చేసిన అత్యధిక ఎనిమిదో వికెట్ భాగస్వామ్యాన్ని సవరించారు.
1996లో కోల్ కతాలో అజహర్-కుంబ్లేలు నమోదు చేసిన 161 పరుగులకే ఇప్పటివరకూ ఎనిమిదో వికెట్కు భారత్ తరపున అత్యధిక భాగస్వామ్యం. ఈ రికార్డును దాదాపు 20 ఏళ్ల తరువాత టీమిండియా అధిగమించడం విశేషం. తొలి సెషన్లో వీరిద్దరూ రాణించడంతో భారత్ జట్టు ఐదు వందల పరుగుల మార్కును దాటింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 158.0 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 529 పరుగులు చేసింది. దాంతో భారత్ కు 129 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.