గోరఖ్‌పూర్ : ఎన్నికల అధికారుల పనితనం మరోసారి తేటతెల్లమయింది. ఇప్పటివరకు ఓటరు జాబితాలో ఓటర్ల పేర్లు గల్లంతు, పేర్లలోగందరగోళం ఉండేది. కానీ ఏకంగా ఓ సెలబ్రిటీని రాష్ట్రం కాని రాష్ట్రం ఓటర్ జాబితాలో చేర్చారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో సోషల్‌మీడియాలో ఎన్నికల అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. చేతుల కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఆదివారం ఉపఎన్నికలు జరగబోతుంటే.. పొరపాటు ఎలా జరిగిందో తెలుసుకుంటామని ఇప్పుడు కూల్‌గా చెప్తున్నారు అధికారులు.
ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరో కాదు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. ఢిల్లీకి చెందిన కోహ్లి పేరు.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఉపఎన్నికల ఓటర్ జాబితాలో వచ్చింది. అంతేకాదు ఆయన పేరిట ఓటర్ స్లిప్ కూడా వచ్చింది. జాబితాలో కోహ్లి పేరు సాహజన్వా అసెంబ్లీనియోజకవర్గంలో 822వ ఓటరు నెంబరుతో రిజిస్టర్ అయింది.
స్థానిక బూత్ అధికారి సునీతా చౌబే ఐదు రోజులు క్రితం ఈ విషయాన్ని గుర్తించినా అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఇప్పుడు బయటకి పొక్కడంతో అసలు ఈ పొరపాటు ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నామని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ప్రభునాథ్ మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, ఉప ముఖ్యమంత్రి మౌర్య ఇద్దరూ రాజీనామా చేయడంతో గోరఖ్‌పూర్, పూల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment