
టాప్10లో ఒకే ఒక్కడు..
ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-10లో కోహ్లీ ఒక్కడే..
లండన్: ఐసీసీ టాప్-10 ర్యాంకింగ్స్‌లో భారత్ తరపున స్థానాన్ని నిలబెట్టుకున్నఒకే ఒక్కడుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫికి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ మినహా ఏ ఒక్క భారత్ బ్యాట్స్‌మెన్ టాప్-10లో లేకపోవడం గమనార్హం. 874 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియన్ ఆటగాడు డెవిడ్ వార్నర్ (871) పాయింట్లతో రెండో స్దానంలో ఉన్నాడు. కోహ్లీ 852 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టాప్-20లో కొనసాగుతున్న భారత్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ 12వ స్థానం, మహేంద్ర సింగ్‌ధోని 13, శిఖర్ ధావన్ రెండు స్థానాలు దిగజారి 15వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక బౌలింగ్ విభాగంలో ఏ ఒక్క భారత్ ఆటగాడు టాప్-10లో లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసే అంశమే. సౌత్ ఆఫ్రికా బౌలర్ కాగిసో రబడా (724 పాయింట్లు)తో తొలిస్థానంలో ఉండగా, ఇమ్రాన్ తాహిర్(722), మిచెల్ స్టార్క్ (701)తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ బౌలర్లలో లెగ్‌స్పిన్నర్ అక్షర్‌పటేల్, న్యూజిలాండ్ బౌలర్ మ్యాథ్ హెన్రీతో 11వ స్థానాన్ని పంచుకున్నాడు. అమిత్ మిశ్రా 13వ, రవిచంద్రన్ అశ్విన్ 18వ స్థానాల్లో నిలిచారు.
ఇక జట్ల పరంగా టాప్-5లో దక్షిణాఫ్రికా(122), ఆస్ట్రేలియా (118), భారత్ (117), న్యూజిలాండ్ (114), ఇంగ్లండ్(112)లు కొనసాగుతున్నాయి. అయితే బంగ్లదేశ్ తొలిసారి శ్రీలంక, పాకిస్థాన్, వెస్టీండిస్‌లను వెనక్కి నెట్టి ఆరో స్థానాన్ని నిలబెట్టుకుంది.