పేస్‌కు పడిపోయారు | Virat Kohli rides luck to score gutsy 54 in final Test vs South Africa | Sakshi
Sakshi News home page

పేస్‌కు పడిపోయారు

Published Thu, Jan 25 2018 12:35 AM | Last Updated on Thu, Jan 25 2018 8:12 AM

Virat Kohli rides luck to score gutsy 54 in final Test vs South Africa - Sakshi

కీలకమైన టాస్‌ మననే వరించింది... ఐదుగురు పేసర్లతో దిగినా, భారత్‌ అనూహ్యంగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అంతలోనే అసలు సిసలు పేస్‌ పిచ్‌ అంటే ఏమిటో తెలిసొచ్చింది... అటు పరుగులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థి భీకర బౌలింగ్‌... ఇటు తంటాలు పడుతూ భారత బ్యాటింగ్‌... మధ్యలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి క్లాస్‌ ఇన్నింగ్స్‌... చతేశ్వర్‌ పుజారా అపరిమిత సహనం... చివర్లో భువనేశ్వర్‌ కుమార్‌ పరిణతి! మొత్తంమీద బంతి రెప్పపాటులో దూసుకొస్తున్న వాండరర్స్‌ వికెట్‌పై కాస్తోకూస్తో చెప్పుకోదగ్గ స్కోరు... ఇక ప్రత్యర్థిని ఎంత తక్కువకు కట్టడి చేస్తే మూడో టెస్టుపై భారత్‌కు అంతగా పట్టు చిక్కుతుంది. 

జొహన్నెస్‌బర్గ్‌: అందరూ అనుకున్నట్లే ఎదురైన పచ్చిక పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌ నిలవలేకపోయారు. సఫారీ పేస్‌ దళం నిప్పులు చెరిగే బంతులకు సమాధానం ఇవ్వలేకపోయారు. బంతి బంతికి గం డం అన్నట్లు ఆడిన ఓపెనర్లు పూర్తిగా నిరాశ పరి చారు. కానీ... అడ్డుగోడ పుజారా (179 బంతుల్లో 50; 8 ఫోర్లు) తోడుగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (106 బంతుల్లో 54; 9 ఫోర్లు) పట్టుదల చూపాడు. లోయరార్డర్‌ లో భువనేశ్వర్‌ (49 బంతుల్లో 30; 4 ఫోర్లు) విలువైన పరుగులు జోడించాడు. దీంతో జొహన్నెస్‌బర్గ్‌లో బుధవారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకు ఆలౌటైంది. రబడ (3/39), మోర్కెల్‌ (2/47), ఫిలాండర్‌ (2/31), ఫెలూక్‌వాయో (2/25) సమష్టిగా రాణించారు. పిచ్‌ పరిస్థితి చూస్తే భారత్‌ది పోరాడే స్కోరుగానే కనిపిస్తోంది. దీనికి తగ్గట్లే భువీ.. ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ మూడో ఓవ ర్లోనే ఓపెనర్‌ మార్క్‌రమ్‌ (2)ను చక్కటి బంతితో అవుట్‌ చేశాడు. ఆట ముగిసే సమయానికి ఎల్గర్‌ (4 బ్యాటింగ్‌), రబడ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 

కోహ్లి స్థైర్యం... పుజారా సహనం... 
అచ్చంగా పేసర్లే రాజ్యమేలే వాండరర్స్‌లో ఉదయం టాస్‌ గెలిచిన కోహ్లి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కానీ... ప్రొటీస్‌ బౌలర్ల పదునుకు ఓపెనర్లు నిలవలేకపోయారు. కేఎల్‌ రాహుల్‌ (0) డకౌట్‌గా వెనుదిరగగా, మురళీ విజయ్‌ (8) విఫలమయ్యాడు. ఈ స్థితిలో పుజారాకు జత కలిసిన కోహ్లి ఇలాంటి పిచ్‌పై ఎలా ఆడాలో సహచరులకు చూపాడు. ఓ వైపు ఫిలాండర్, మోర్కెల్, రబడ, ఇన్‌గిడి కదం తొక్కుతుండగా... పరిస్థితులు పూర్తి ప్రతికూలంగా ఉన్నప్పటికీ స్థైర్యం కోల్పోకుండా నిలిచాడు. లంచ్‌ విరామానికి భారత్‌ 45/2తో నిలిచింది. ఈ సెషన్లో ఫిలాండర్‌ అత్యంత ప్రమాదకరంగా కనిపించాడు. లంచ్‌తర్వాత పుజారా ఫిలాండర్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టి టచ్‌లోకి రాగా,  రబడ బౌలింగ్‌లో బౌండరీతో కోహ్లి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే... మరుసటి ఓవర్లో తక్కువ ఎత్తులో వచ్చిన ఇన్‌గిడి బంతిని డ్రైవ్‌ ఆడబోయి స్లిప్‌లో డివిలియర్స్‌కు చిక్కాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 84 పరుగులు జోడించారు. దీంతో అజింక్య రహానే (9) క్రీజులోకి వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య తుది జట్టులోకి వచ్చిన అతడు అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు.  వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ (2) తోడుగా పుజారా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12 బంతుల వ్యవధిలో ఒక్క పరుగూ రాకుండానే మూడు వికెట్లు పడిపోవడంతో భారత్‌  పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 

అవకాశాలు వచ్చినా...
కోహ్లి వ్యక్తిగత స్కోరు 11 వద్ద ఉండగా ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను ఫిలాండర్‌... 32 పరుగుల వద్ద క్యా చ్‌ను స్లిప్‌లో డివిలియర్స్‌ జారవిడిచారు. పుజారా సున్నా మీద ఉండగా... స్పష్టంగా ఎల్బీ అయినా సందేహంతో దక్షిణాఫ్రికా రివ్యూ కోరలేదు. రహానే 3 పరుగుల వద్ద ఫిలాండర్‌ బౌలింగ్‌లో అవుటైనా నోబాల్‌గా తేలడంతో వెనుక్కు పిలిపించారు. 

54 తొలి పరుగు తీసేందుకు చతేశ్వర్‌ పుజారా ఎదు ర్కొన్న బంతులు. భారత్‌ తరఫున రాజేశ్‌ చౌహాన్‌ (57–శ్రీలంకపై, 1994) పేరిట ఈ రికార్డు ఉంది. అయితే ఇన్నింగ్స్‌ మధ్యలో పరుగు తీయకుండా ఎక్కువ బంతులు ఆడింది మాత్రం రవిశాస్త్రి. ఇదే జొహన్నెస్‌బర్గ్‌లో 1992 సిరీస్‌లో శాస్త్రి 9 పరుగుల స్కో రుకు చేరుకున్నాక వరుసగా 68 బంతుల పాటు పరుగే తీయలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement