కోహ్లికి ఆర్మీ క్యాప్ అందజేస్తున్న ధోని
రాంచీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి దిగిన టీమిండియా పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘనంగా నివాళులర్పించింది. టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లి ఫీల్డింగ్‌వైపు మొగ్గుచూపాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీరజవాన్లు, వారి కుటుంబాలు దేశానికి చేసిన సేవకు చిహ్నంగా ఈ మ్యాచ్‌లో ఆర్మీక్యాప్‌లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ప్రకటిస్తున్నట్లు ప్రకటించాడు. ఎలాంటి మార్పుల్లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా జట్టులో మాత్రం ఒక మార్పు చోటుచేసుకుంది. నాథన్ కౌల్టర్ నీల్ స్థానంలో రిచర్డ్సన్ తుదిజట్టులోకి వచ్చాడు. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లిసేన ఈ మ్యాచ్‌ను సైతం గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఎలాగైనా ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్ పోరులో నిలవాలని ఆతిథ్య ఆసీస్ భావిస్తోంది.
ఇక మ్యాచ్‌కు ముందు లెప్టనెంట్ కల్నల్ హోదా కలిగిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆటగాళ్లందరికీ ఆర్మీ క్యాప్‌లు అందజేశారు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ఉపయోగిస్తామని ప్రకటించింది.
తుదిజట్లు:
భారత్ : కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాయుడు, విజయ్ శంకర్, జాదవ్, ధోని, జడేజా, కుల్దీప్, బుమ్రా, షమీ
ఆస్ట్రేలియా : ఫించ్ (కెప్టెన్), ఖాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కారీ, కమిన్స్, లయన్, జంపా, రిచర్డ్సన్
Comments
Please login to add a commentAdd a comment