'అందుకు కారణం కోహ్లి సపోర్ట్'
కొలంబో:శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టు మ్యాచ్ కు తీవ్ర జ్వరం కారణంగా దూరమైన రాహుల్.. రెండో టెస్టులో ఆకట్టుకున్నాడు. భారత్ కు చక్కటి ఆరంభాన్ని అందించి అర్థ శతకం సాధించాడు. ఇది రాహుల్ కు వరుసగా ఆరో హాఫ్ సెంచరీ కావడం విశేషం. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత ఆటగాడిగా రాహుల్ గుర్తింపు పొందాడు. అయితే తన ఆట తీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్న రాహుల్.. అందుకు కారణం కెప్టెన్ విరాట్ కోహ్లినే అంటున్నాడు. తనలో ఆత్మవిశ్వాసం పెరిగి రాణించడానికి కోహ్లి ఇచ్చిన సపోర్టే కారణమన్నాడు.
'నేను గాయంతో కొన్ని నెలల పాటు జట్టుకు దూరమైన తరువాత సహచర క్రికెటర్ల నుంచి లభించిన మద్దతు మరువలేనిది. నేను సర్జరీ చేయించుకున్న తరువాత నా పరిస్థితిని తోటి క్రికెటర్లు ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఇక్కడ ప్రధానంగా కోహ్లి నుంచి చక్కటి సహకారం లభించింది. నీ కోసం జట్టు నిరీక్షిస్తుందంటూ మెస్సేజ్ లతో నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ఇదే నేను భయం లేకుండా తిరిగి జట్టులో అడుగుపెట్టడానికి కారణమైంది. కోహ్లితో పాటు సహాయక సిబ్బంది కూడా అండగా నిలిచారు. వారు చూపించిన సహాకారం నా చిన్న కెరీర్ లో కచ్చితంగా చాలా పెద్దది. నాకు ప్రతీ విషయంలో కోహ్లి అండగా నిలిచాడు' అని రాహుల్ పేర్కొన్నాడు.