సచిన్ కోసం గెలుస్తాం
జైపూర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చివరి సారిగా పొట్టి ఫార్మాట్‌లో కనిపించే టోర్నీగా ఇప్పటికే ఈ సీజన్ చాంపియన్స్ లీగ్ టి20కి కావల్సినంత క్రేజ్ వచ్చింది. దీంతో అటు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ కూడా తమ దిగ్గజ ఆటగాడి కోసం ఈ మెగా ఈవెంట్‌ను గెలిచి కానుకగా ఇవ్వాలని భావిస్తున్నాడు.
‘సచిన్‌కు ఇది చివరి టి20 టోర్నీ అని మాకు తెలుసు. అందుకే అతడి కోసం మేం మంచి క్రికెట్ ఆడాలని భావిస్తున్నాం. టోర్నీ గెలిస్తే మరీ మంచిది. తన 200వ టెస్టు, రిటైర్మెంట్ గురించి ఇప్పుడే అనవసరం. ఈటోర్నీలో అతడు రాణించాలని కోరుకుంటున్నాను’ అని రోహిత్ అన్నాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై జట్టు తలపడనుంది. కోచ్ జాన్ రైట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘సచిన్ 16 ఏళ్ల వయస్సులో న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను తొలిసారిగా చూశాను. తర్వాత 2000లో అదే భారత జట్టుకు నేను కోచ్‌గా మారాను. చాలా ఏళ్లుగా అతడిని నేను దగ్గరగా ఉండి చూశాను. ఆట పట్ల అతని దృక్పథాన్ని ఎన్నడూ మార్చుకోలేదు. అతడి అద్భుత విజయానికి ఇదే కారణం. యువ ఆటగాళ్లు ఈ విషయాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది’ అని రైట్ కొనియాడారు.
సచిన్ గొప్ప ఆటగాడే కానీ..: ద్రవిడ్
సచిన్ టెండూల్కర్ అద్భుత ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదని, అలాగని తమ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. ‘సచిన్, నేను కలిసి ప్రత్యర్థులుగా ఇదివరకే ఆడాం. అలాగే భారత్ తరఫునా కలిసి ఆడాం.
కానీ శనివారం జరిగే మ్యాచ్‌కు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. రాజస్థాన్, ముంబై జట్ల మధ్య జరిగే మ్యాచ్‌గానే చూడాల్సి ఉంటుంది. సెమీస్‌లో కూడా మేమే తలపడాలని కోరుకుంటున్నాను. అయితే ఈ సీఎల్‌టి20ని నా చివరి టోర్నీగా అయితే ఇప్పటిదాకా భావించడం లేదు’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.