శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం కొలంబో వేదికగా లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో హిట్‌మ్యాన్ 64 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన భారత ఓపెనర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. రోహిత్ ఇప్పటివరకు 121 సార్లు 50 ప్లస్ పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది.
సచిన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో భారత ఓపెనర్‌గా 120 సార్లు 50కిపైగా స్కోర్లు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో హిట్‌మ్యాన్ ఆరో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(146 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్లు
1. డేవిడ్ వార్నర్ - 146 (374 మ్యాచ్‌లు)
2. క్రిస్ గేల్ - 144 (441 మ్యాచ్‌లు)
3. సనత్ జయసూర్య - 136 (: 506 మ్యాచ్‌లు)
4. డెస్మండ్ హేన్స్ - 131 ( 354 మ్యాచ్‌లు)
5. గ్రేమ్ స్మిత్ - 125 (342 మ్యాచ్‌లు)
6. రోహిత్ శర్మ - 121 (334 మ్యాచ్‌లు)
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఈ ముంబైకర్ అధిగమించాడు. ధోనీ మొత్తం 10,773 సాధించగా.. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 10,831 చేరాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధోనిని వెనక్కి నెట్టి ఐదో స్ధానానికి హిట్‌మ్యాన్ చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment