ఉత్కంఠ పోరులో విండీస్దే గెలుపు
ఫ్లోరిడా: అమెరికా గడ్డపై తొలి అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్ అభిమానులను అలరించింది. భారత్- వెస్టిండీస్ ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఫ్లోరిడాలోని లౌడర్ హిల్ మైదానంలో శనివారం ఉదయం(స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. యువ సంచలనం కేఎల్ రాహుల్ వీరవిహారం, రోహిత్ శర్మ విజృంభణతో టీమిండియా.. దాదాపు విజయతీరాలకు చేరినప్పటికీ నాటకీయ పరిణామాల మధ్య ఆఖరిబంతికి పరాజయం పాలైంది. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా మ్యాచ్ అసలు ఉద్దేశం(అమెరికన్లకు క్రికెట్ మజాను పంచడంలో)నెరవేర్చడంలో మాత్రం ఇరు జట్లూ విజయం సాధించాయనే చెప్పాలి.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు సాధించింది. ఇది టీ20ల్లోనే మూడో అదిపెద్ద స్కోరు. 246 పరుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే హంసపాదులా ఓపెనర్ రహానే (7), వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ (16)లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో మరో ఓపెనర్ రోహిత్ శర్మ.. సెకెండ్ డౌన్ కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ విజృంభించాడు. 28 బంతులు ఆడిన రోహిత్.. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు పిండుకుని 12వ ఓవర్ లో మూడో వికెట్ గా ఔటయ్యాడు. మరోవైపు యువ సంచలనం కేఎల్ రాహుల్ తనదైన శైలిలో షాట్లు కొడుతూ 51 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 110 పరుగులు చేశాడు. ఇది అతనికి తొలి టీ20 సెంచరీ కావడం విశేషం. 25 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ బాదిన ధోనీ 43 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు చేయాల్సి ఉండగా రాహుల్, ధోనీలు షాట్లు కొట్టకుండా కూల్ గా నెట్టుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా ధోనీ కొట్టిన షాట్ ను శామ్యూల్స్ ఒడిసిపట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా 244 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను ముగించింది. రెండు టీ20ల సిరీస్ లో విండీస్ 1-0తో ముందంజలో ఉంది. విండీస్ బౌలర్లలో బ్రావో రెండు వికెట్లు, రసెల్, పొలార్డ్ లు తలో వికెట్ చేజిక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ కు విండీస్ బ్యాట్స్ మన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ టీ20 చరిత్రలోనే మూడో అతిపెద్ద స్కోరు 245(20 ఓవర్లలో) సాధించారు. ఓపెనర్ లెవిస్ 100(49 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా, అతని భాగస్వామి చార్లెస్ 33 బంతుల్లో 79 పరుగులు చేసి 10 ఓవర్లో తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆండీ రసెల్ 22(12 బంతులు), పొలార్ట్ 22(15 బంతులు) తమవంతు పాత్ర పోషించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన విండీస్ 245 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా, రవీంద్ర జడేజాలు చెరో రెండు వికెట్లు నేలకూల్చగా, షమి ఒక్క వికెట్ పడగొట్టాడు.