కేఎల్ రాహుల్ మరో మైలురాయి
కింగ్ స్టన్: ఇటీవల జింబాబ్వేతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రంలోనే శతకం చేసిన భారత తొలి ఓపెనర్గా, బ్యాట్స్మెన్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న కేఎల్ రాహుల్.. తాజాగా వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో మరో మైలురాయిని నమోదు చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా రెండో టెస్టులో రాహుల్(158;303 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సెంచరీ సాధించాడు. తద్వారా మొదటి(వరుస) మూడు హాఫ్ సెంచరీలను శతకాలుగా మార్చిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. అంతకుముందు ఈ ఘనతను భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ఒక్కడే సాధించాడు.
మరోవైపు విండీస్లో అత్యధిక స్కోరు సాధించిన ఆరో భారత ఓపెనర్గా రాహుల్ నిలిచాడు. వెస్టిండీస్లో సునీల్ గవాస్కర్(220), వసీం జాఫర్(212), సిద్ధూ(201), వీరేంద్ర సెహ్వాగ్(180), ఎంఎల్ ఆప్టే(163నాటౌట్)లు మాత్రమే రాహుల్ కంటే అత్యధిక స్కోర్లు నమోదు చేసిన భారత ఓపెనర్లు. ఇది రాహుల్ కెరీర్ లో ఆరో టెస్టు మ్యాచ్ కాగా, అంతకుముందు శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టుల్లో రాహుల్ శతకాలు నమోదు చేశాడు.
ఇదిలా ఉండగా, సబీనా పార్క్ మైదానంలో 150కు పైగా పరుగులు చేసిన రెండో భారత ఓపెనర్ రాహుల్ కావడం విశేషం. అంతకుముందు పంకజ్ రాయ్ భారత తరపున ఓపెనర్ గా ఇక్కడ 150కు పైగా పరుగులు సాధించాడు. కాగా, ఓవరాల్ గా ఇక్కడ 150 కు పైగా పరుగులు చేసిన తొమ్మిదో ఓపెనర్ రాహుల్. 1981లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రహం గూచ్ ఇక్కడ చివరిసారి 150కు పైగా పరుగులు సాధించాడు.
విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ (303 బంతుల్లో 158; 15 ఫోర్లు, 3 సిక్స్) రెండో టెస్టులో చెలరేగిపోయాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 125 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న రాహుల్‌ను విండీస్ బౌలర్ గాబ్రియెల్ ఔట్ చేశాడు.