క్రికెటర్లూ.. ఇలా అయితే ఎలా?:బీసీసీఐ
సెయింట్ కిట్స్:బీచ్..బీరు.. కరీబియన్ లైఫ్ స్టైయిల్లో సర్వ సాధారణం. అయితే ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత యువ జట్టు అక్కడి వాతావారణాన్ని బాగా ఆస్వాదిస్తుంది. అక్కడ బీచ్ల్లో ఉల్లాసంగా గడుపడమే కాకుండా 'విండీస్' స్టైల్ను కూడా బాగా ఒంట బట్టించుకుంటుంది. అలా బీచ్లకు సరదాగా వెళ్లడమే కాదు.. బీర్లను కూడా తాగుతూ అక్కడ వారికి తాము ఎంతమాత్రం తీసిపోని ఫోజులిస్తున్నారు మన క్రికెటర్లు. అక్కడితో ఊరుకోకుండా సెల్ఫీలను తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల కొంతమంది క్రికెటర్లు ఇలా దూకుడుగా వ్యవహరించడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా భారత క్రికెటర్లు సరైన పద్ధతిలో నడుచుకుని అందరికీ ఆదర్శవంతంగా నిలవాలంటూ హితబోధ చేసింది.
'యువ క్రికెటర్లూ.. ఇలా అయితే ఎలా?, మీరు అందరికీ రోల్ మోడల్స్. ఈ విషయాన్ని మరిచిపోతే ఎలా?, చాలా మంది పిల్లలు గుడ్డిగా మీ నడవడికను ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. మీరు ఆన్ ఫీల్డ్ లో ఏమి చేసే విషయాలను యువత ఎలా గమినిస్తుందో, అదే తరహా ఆఫ్ ఫీల్డ్ యాక్షన్స్ కూడా ఫాలో అవుతుంది. మీరు రోల్ మోడల్స్ అనే సంగతి మరచిపోవద్దు' అని బీసీసీఐ చురకలంటింది.
గత రెండు రోజుల క్రితం కొంతమంది భారత క్రికెటర్లు ప్రముఖ పర్యాటక ప్రాంతం సెయింట్ నెవిస్ బీచ్ కు వెళ్లి అక్కడ బీర్లతో చక్కర్లు కొట్టారు. ప్రత్యేకంగా కర్ణాటక ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ, ప్రధాన పేసర్ ఉమేష్ యాదవ్ లు బీచ్ లో బీర్లతో సందడి చేశారు. ఆ ఫోటోలను సెల్ఫీల రూపంలో బంధించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో బీసీసీఐ అధికారుల్ని అసంతృప్తికి గురి చేసింది. ఇక నుంచి ఆ తరహా చర్యలకు పాల్పడవద్దని సదరు క్రికెటర్లకు ఉపదేశించింది.