
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రయల్స్ నుంచి స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, సాక్షి మాలిక్‌లు తప్పుకున్నారు. వీరిద్దరితో పాటు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలు కూడా ట్రయల్స్‌లో పాల్గొనలేమని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు నివేదించారు. దీనిపై స్పందించిన డబ్ల్యూఎఫ్‌ఐ వారికి మినహాయింపు ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కీలకమైన పోటీలకు ముందు ఎలాంటి ఉదాసీనతలకు తావివ్వకుండా ఉండేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోనెపట్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో వచ్చే నెల 10 నుంచి పురుషుల కోసం ట్రయల్స్ నిర్వహించనున్నారు.
ఈ ట్రయల్స్‌లో ఫ్రీస్టయిల్, గ్రీకోరోమన్ విభాగాల్లో రెజ్లర్లకు తర్ఫీదు ఇవ్వనున్నారు. మహిళల కోసం లక్నోలో జూన్ 17 నుంచి ఈ ట్రయల్స్ జరుగుతాయి. ఈ నేపథ్యంలో నలుగురు రెజ్లర్లు తమను ట్రయల్స్ నుంచి మినహాయించాలని కోరడంతో డబ్ల్యూఎఫ్‌ఐ అధికారులు దీనికి సమ్మతించారు.