
ఇండోర్: టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ మరోసారి రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం 7 వికెట్లు తీశాడు. అతనికంటే తక్కువ వికెట్లు తీసినా... ఇషాంత్, ఉమేశ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ ముగ్గురి మధ్య జరిగిన సరదా సంభాషణలో ఇదే విషయాన్ని ఇషాంత్ ప్రశ్నించాడు. ‘షమీ బౌలింగ్‌లో బంతి ఎప్పుడు ప్యాడ్‌కు తగిలినా ఎల్బీడబ్ల్యూ అవుతోంది. పుల్ చేయబోతే క్యాచ్ అవుట్‌గా మారుతోంది. మేం మాత్రం బ్యాట్స్‌మెన్‌ను బీట్ చేసి చేసి అలసిపోతున్నాం. చాలా పరేషాన్ అవుతున్నాం.
మేమూ నీలాగే బౌలింగ్ చేస్తున్నా వికెట్లు దక్కడం లేదు. నీ బంతి సరిగ్గా ప్యాడ్‌లకు తగిలితే మా బంతి పైనుంచి వెళ్లిపోతోంది. ఇంతకీ నీ రహస్యమేంటో చెప్పు’ అని షమీని ఇషాంత్ అడిగాడు. దీనిపై అంతే సరదాగా స్పందించిన షమీ ఆ తర్వాత తన బౌలింగ్‌ను విశ్లేషించాడు. ‘దానికి కారణం బిర్యానీ, కబాబ్‌లు అని చాలా మంది అంటుంటారు. కానీ అదొక్కటే సరిపోదు. మీరు కూడా బాగా బౌలింగ్ చేయడం వల్లే నాపై ఒత్తిడి తక్కువగా ఉంటోంది.
స్వేచ్ఛగా బౌలింగ్ చేస్తున్నాను. దేవుని దయ వల్ల కొంత అదృష్టం కూడా కలిసి వస్తోంది. ఏకాగ్రతతో ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ బాగా పడుతోందని అనిపించినప్పుడు సరిగ్గా అలాగే దానిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నా. దాంతో అదే కచ్చితత్వం కొనసాగుతోంది’ అని షమీ వివరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో తొలి 23 ఓవర్ల వరకు స్పిన్నర్‌తో పని లేకుండా భారత పేసర్లు బౌలింగ్ చేయడం విశేషం. 2001 తర్వాత స్వదేశంలో రెండో ఇన్నింగ్స్‌లో ఇంత సుదీర్ఘంగా మన పేసర్లు బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఇదే మన పేసర్ల సత్తాను చూపిస్తోంది. అదే విధంగా ఏ టెస్టులోనైనా రెండో ఇన్నింగ్స్‌లో 30 ఓవర్ల వరకు కూడా భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేయకపోవడం కూడా ఇదే తొలిసారి. ఈ ఇన్నింగ్స్ 34వ ఓవర్లో గానీ అశ్విన్‌కు బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment