అసలైన 'టెస్టు'
యువ క్రికెటర్లతో కూడిన భారత జట్టు 22 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై సిరీస్ గెలిచి సంచలనం సృష్టించింది. దిగ్గజాలెందరికో సాధ్యం కాని ఘనతను ఈ యువ జట్టు అందుకుంది. అయితే ఆ విజయం కేవలం ‘వాపు’మాత్రమే. ఎందుకంటే ఆ సిరీస్‌లో ఆడిన శ్రీలంక జట్టు గత రెండు దశాబ్దాల్లోనే అత్యంత బలహీనంగా ఉన్న జట్టు. దక్షిణాఫ్రికాతో సిరీస్ శ్రీలంక తరహాలో సులభం కాదు. ఆడేది సొంతగడ్డ మీదే అయినా పటిష్టమైన జట్టుతో భారత్‌కు టెస్టు సిరీస్ అసలైన పరీక్ష.
* కోహ్లి సేన ముందు కఠిన పరీక్ష
* విదేశాల్లో నిలకడగా ఆడే దక్షిణాఫ్రికా
* ఈసారి కూడా బలంగానే ప్రత్యర్థి
సాక్షి క్రీడావిభాగం: సొంతగడ్డపై భారత్ ఎప్పుడూ బలమైన జట్టే. ప్రత్యర్థి ఎవరైనా... జట్టులో ఎవరున్నా... తరాలు మారినా... స్వదేశంలో భారత్‌ను ఓడించాలంటే ప్రత్యర్థులెవరికైనా కష్టమే. అయితే దక్షిణాఫ్రికా జట్టు మాత్రం 2000లోనే భారత్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో స్వీప్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది.
అప్పటికి ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసి ఎనిమిదేళ్లే అయింది. అయినా స్పిన్నర్లకు సహకరించే పిచ్‌లపై కూడా గెలవగలిగింది. సంప్రదాయబద్ధంగా భారత క్రికెటర్లు స్పిన్ బాగా ఆడతారు. సాధారణంగా ఇక్కడి పిచ్‌లు నెమ్మదిగా ఉంటాయి కాబట్టి... ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి ప్రత్యర్థిని కట్టడి చేయాలనే వ్యూహంతోనే ప్రతిసారీ బరిలోకి దిగుతారు.
గతంలో దక్షిణాఫ్రికా జట్టుకు ఒక బలహీనత ఉండేది. ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లలోకి స్పిన్ ఆడటంలో బాగా బలహీనం సఫారీలే. అందుకే ఆ జట్టు కోసం ప్రతిసారీ స్పిన్ పిచ్‌లు తయారు చేసేవారు. ఈసారి కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉండొచ్చు. పేస్, బౌన్స్‌తో కళకళలాడే మొహాలీ పిచ్ కూడా ఇప్పుడు స్పిన్నర్లకు అనుకూలించేలా ఉందనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈసారి కూడా భారత్ ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతోనే బరిలోకి దిగే అవకాశముంది.
ఇప్పుడు మెరుగు
కేవలం స్పిన్ అస్త్రంతో దక్షిణాఫ్రికాను భారత్ నియంత్రించగలదా అనేది కూడా సందేహమే. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెటర్లు స్పిన్ ఆడటంలో బాగా మెరుగుపడ్డారు. కెప్టెన్ ఆమ్లాతో పాటు డు ప్లెసిస్, డికాక్, డుమిని స్పిన్ బౌలింగ్‌ను చీల్చిచెండాడగల సమర్థులు. వీరిని నియంత్రించాలంటే అత్యంత భయంకరమైన స్పిన్ ట్రాక్ వేయాలి. అయితే ఇలా చేసినా ప్రమాదం పొంచి ఉంది.
ఒక గొప్ప స్పిన్నింగ్ ట్రాక్ ఎదురైతే... దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను ఎదుర్కోగల సత్తా భారత యువ క్రికెటర్లలో ఉందా అనేది అనుమానమే. ఇటీవల శ్రీలంకలోని గాలెలో జరిగిన టెస్టులో భారత్ 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 112 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. రంగన హెరాత్ బంతులకు భారత బ్యాట్స్‌మెన్ దగ్గర సమాధానం లేకపోయింది.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైతే కష్టం. కాబట్టి భారత్ ఈ సిరీస్‌కు బాగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. మరోవైపు తుది జట్టులో స్పిన్నర్లు ఎవరనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం భారత్‌కు అత్యుత్తమ స్పిన్నర్ అశ్విన్. కానీ అతను గాయంతో ఉన్నాడు. తొలి టెస్టు సమయానికి కోలుకుంటే ఫర్వాలేదు. లేకపోతే అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా మిగిలిన ఇద్దరు స్పిన్నర్లు.
ఈసారి జట్టు ఎంపిక సమయంలో కేవలం ముగ్గురు స్పిన్నర్లనే తీసుకున్నారు. అశ్విన్‌కు గాయం ఉందని తెలిసినా ఇలాగే ఎంపిక చేశారు. ఒకవేళ అశ్విన్‌కు గాయం తగ్గకపోతే ముగ్గురు స్పిన్నర్లతో ఆడాల్సిన పరిస్థితిలో ప్రత్యామ్నాయం ఏమిటనే ప్రశ్నకు సమాధానం లేదు.
నిలకడే ఆయుధం
దక్షిణాఫ్రికా జట్టులో ప్రస్తుతం ఉన్న క్రికెటర్లంతా నిలకడకు మారు పేరు. ఆమ్లా, డు ప్లెసిస్, డివిలియర్స్‌లతో పాటు బావుమా కూడా స్పిన్ బాగా ఆడతాడు. ఫ్లాట్ వికెట్ ఎదురైతే వీళ్లని ఆపడం మరింత కష్టం. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల మ్యాచ్‌లో సెంచరీతో డివిలియర్స్ ఫామ్‌ను కోల్పోలేదని అర్థమైంది.
అయితే ఈ ఇన్నింగ్స్‌లో అతను ఆడిన స్వీప్‌లు, రివర్స్ స్వీప్‌లు చూస్తే భారత స్పిన్నర్లకు రాబోయే నెల రోజులు కష్టకాలంలాగే కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌లో కూడా పేస్‌నే నమ్ముకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టెయిన్ టెస్టుల్లో మరింత ప్రమాదకారి. భారత పిచ్‌లపై రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు.
పేసర్లు స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్‌లతో పాటు తాహిర్ తుది జట్టులో ఉంటాడు. ఈసారి పర్యటనకు సఫారీలు కూడా భారీగానే స్పిన్నర్లను తీసుకొచ్చారు. డుమిని గాయం నుంచి కోలుకుంటే వారికి మంచి స్పిన్ ప్రత్యామ్నాయం ఉన్నట్లే. ఒకవేళ డుమిని కోలుకోకపోతే లెఫ్టార్మ్ స్పిన్ వేయగల ఆల్‌రౌండర్ ఎల్గర్ ఉన్నాడు. హార్మెర్, పిడెట్‌ల రూపంలో ఇద్దరు ఆఫ్‌స్పిన్నర్లు కూడా జట్టుతో పాటు ఉన్నారు. కాబట్టి దక్షిణాఫ్రికా అన్ని రంగాల్లోనూ పటిష్టంగానే కనిపిస్తోంది. ఈ జట్టుపై గెలవాలంటే కోహ్లి సేన అసాధారణంగా ఆడాలి.
మన పరిస్థితి ఏమిటి?
టెస్టు కెప్టెన్ కోహ్లి, డెరైక్టర్ రవిశాస్త్రి ఐదుగురు బౌలర్ల మంత్రాన్ని పఠిస్తున్నారు. ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులో ఉంటే ఇద్దరు పేసర్లు ఆడాలి. ఇషాంత్‌పై ఒక టెస్టు నిషేధం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఉమేశ్, ఆరోన్ ఇద్దరినీ తీసుకుంటారా? లేక ఆల్‌రౌండర్ అనే కారణం వల్ల స్టువర్ట్ బిన్నీని తెస్తారో చూడాలి.
జడేజా తుది జట్టులో ఉండే అవకాశం ఉన్నందున... బిన్నీని ఆపి, ఇద్దరు సిసలైన పేసర్లను తీసుకునే అవకాశమే ఉంది. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ లైనప్‌ను భారత బ్యాట్స్‌మెన్ ఏ మేరకు ఒత్తిడిలో నెట్టగలరనేది కూడా ప్రశ్నార్థకమే. విజయ్, ధావన్ ఫిట్‌నెస్‌తోనే ఉన్నందున లోకేశ్ రాహుల్‌కు అవకాశం రాకపోవచ్చు.
కోహ్లి, రహానే, రోహిత్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తుది జట్టులో ఉండటం ఖాయం. ఈ లెక్క ప్రకారం పుజారా మరోసారి బెంచ్‌కు పరిమితం కావాలి. ఇలా జట్టు కూర్పుపై స్పష్టత లేకపోవడం భారత్‌కు ప్రధాన సమస్య. ఏమైనా కచ్చితమైన ప్రణాళిక, సన్నద్ధత లేకపోతే మరోసారి దక్షిణాఫ్రికా చేతిలో పరాభవం తప్పదు.
11 ఇప్పటివరకూ భారత్, దక్షిణాఫ్రికాల మధ్య 11 టెస్టు సిరీస్‌లు జరిగాయి. ఇందులో ఆరు దక్షిణాఫ్రికా గెలిస్తే... భారత్ రెండు మాత్రమే నెగ్గింది. మిగిలిన మూడు సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
5 ఈ రెండు దేశాల మధ్య భారత్‌లో ఐదు సిరీస్‌లు జరిగితే రెండింట భారత్, ఒక సిరీస్‌లో దక్షిణాఫ్రికా నెగ్గాయి. రెండు సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి.