
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ట్రోఫీ కోసం తుది సమరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం నగరంలోని వాంఖేడే వేదికగా జరుగుతున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
పునరాగమనంలోనూ ఘనమైన రికార్డును నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరిన ధోని జట్టు, అసలు అంచనాలే లేని స్థితి నుంచి అద్భుతంగా పైకెదిగిన విలియమ్సన్ సేన. ఎవరు గెలిచినా ఈ సీజన్‌కది ప్రత్యేక ముగింపే. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే రెండు లీగ్ మ్యాచ్‌లు, మొదటి క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌పై చెన్నైదే పైచేయి. తక్కువ స్కోర్లను కాపాడుకుంటూ, భారీ లక్ష్యాలను అందుకుంటూ మిగతా ప్రత్యర్థులందరినీ చుట్టేసిన సన్‌రైజర్స్‌కు... సూపర్ కింగ్స్ ఒక్కటే కొరకరాని కొయ్యగా మిగిలింది. బ్యాట్స్‌మెన్ అనూహ్య ఇన్నింగ్స్‌లు, ఆల్‌రౌండర్ల అండ, బౌలర్ల నిలకడతో దుర్భేద్యంగా ఉన్న చెన్నైని ఓడించాలంటే హైదరాబాద్ సమష్టిగా శక్తికి మించి ఆడాల్సిందే.
భీకర బౌలింగ్ వనరులున్నప్పటికీ ప్రత్యర్థి జట్టులో ఎవరో ఒక బ్యాట్స్‌మన్ అసాధారణంగా ఆడుతుండటంతో సూపర్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ లొంగదీసుకోలేకపోతోంది. లీగ్ మ్యాచ్‌లలో రెండుసార్లూ అంబటి రాయుడు దెబ్బ కొట్టగా, క్వాలిఫయర్‌లో ఆ పనిని డు ప్లెసిస్ చేశాడు. సమ ఉజ్జీలైన రెండు జట్ల మధ్య ఈ మూడు ఇన్నింగ్స్‌లే తేడా చూపాయి. ప్రణాళికతో ముందునుంచే అప్రమత్తం అయితే ఫైనల్లోనూ ఇలా జరగకుండా చూసుకోవచ్చు. కీలకమైన వాట్సన్, రాయుడితో పాటు రైనా, డు ప్లెసిస్‌లను త్వరగా ఔట్ చేస్తే చెన్నై జోరును తగ్గించినట్లవుతుంది. ధోని, బ్రేవోలపైకి రషీద్ ఖాన్‌ను ప్రయోగించి ఫలితం రాబట్టొచ్చు.
లీగ్ దశలో బ్యాటింగ్ భారాన్నంతా మోసిన కెప్టెన్ విలియమ్సన్ రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఫైనల్లో రాణించి కప్ అందిస్తే అతడికి ఈ సీజన్ మరపురానిదిగా మిగిలిపోతుంది. యూసుఫ్ పఠాన్ ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్‌రౌండర్లు షకీబ్, బ్రాత్‌వైట్, బౌలర్లు భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఇప్పటివరకు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఏది ఏమైనా ఫైనల్ పోరు ఆసక్తికరం. ఇరు జట్లు బలంగా ఉండటంతో కప్ ఎవరు సాధిస్తారో అని అభిమానులు ఉత‍్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment