
మందుబాబుల గోల!
సాకర్ వరల్డ్ కప్ వేడి ప్రపంచం మొత్తాన్ని తాకింది. ఆతిథ్య దేశం బ్రెజిల్‌లోనే కాదు...మెక్సికో మొదలు నేపాల్ వరకు ఈ సంబరాలు సాగుతున్నాయి.
పారిస్: సాకర్ వరల్డ్ కప్ వేడి ప్రపంచం మొత్తాన్ని తాకింది. ఆతిథ్య దేశం బ్రెజిల్‌లోనే కాదు...మెక్సికో మొదలు నేపాల్ వరకు ఈ సంబరాలు సాగుతున్నాయి. అయితే అవన్నీ అవధులు దాటి కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. గ్రీస్‌పై 3-0తో కొలంబియా విజయం సాధించిన అనంతరం అక్కడి బొగొటా నగరంలో జరిగిన గొడవలు, కారు ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. దాంతో అక్కడి మేయర్ కొలంబియా మ్యాచ్‌లు ఉన్న రోజున నగరంలో ఆల్కహాల్ అమ్మకాలను నిషేధించారు.
ఈ నగరంలో విజయం తర్వాత ఏకంగా 3 వేల వీధి గొడవలు నమోదయ్యాయి! ఫ్రాన్స్‌లోనైతే సొంత దేశం కాకపోయినా అల్జీరియా అభిమానులు రెచ్చిపోయారు. కొరియాపై ఆ జట్టు గెలిచిన అనంతరం చేసుకున్న సంబరాలు శృతి మించాయి. రాళ్ల దాడి కూడా జరగడంతో పోలీసులు 28 మంది అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్ డ్రా కావడంతో నౌకలో ప్రయాణిస్తున్న ఒక మెక్సికో అభిమాని బాగా తాగిన మత్తులో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవడం కూడా వరల్డ్ కప్ మహిమే! ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్ కప్ సందర్భంగా ‘మందు’ బారిన పడని దేశం ఉండటం లేదు.