
కొలంబో: శ్రీలంక అండర్–19 జట్టుతో రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత అండర్–19 జట్టు... ఐదు వన్డేల సిరీస్‌లోనూ విజయంతో బోణీ కొట్టింది. సోమవారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత శ్రీలంక 38.4 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది.
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ ఆటగాడు అజయ్ దేవ్ గౌడ్ 6.2 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మోహిత్ జాంగ్రా (2/14), యతిన్ (2/35), ఆయూశ్ (2/37) కూడా లంకను దెబ్బ తీశారు. 144 పరుగుల లక్ష్యాన్ని భారత్ 37.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి అధిగమించింది. అనూజ్ రావత్ (50; 5 ఫోర్లు), సమీర్ (31 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు.