యువీకి కలిసొచ్చిన అంశం ఏమంటే..
సుదీర్ఘ కసరత్తు తర్వాత.. వన్డే, టీ20 జట్లకు టీమిండియాను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
సుదీర్ఘ కసరత్తు తర్వాత.. వన్డే, టీ20 జట్లకు టీమిండియాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ నేతృత్వంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఈ జట్లు సిద్ధమయ్యాయి. వన్డే, టి20 జట్ల సారథ్య బాధ్యతల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ధోనీ ప్రకటించిన తర్వాత ఎంపిక చేసిన తొలిజట్టు ఇదే.
దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత యువరాజ్ సింగ్ మళ్లీ వన్డే జట్టులోకి ఎంపిక కావడం ఈ జట్టులోని ముఖ్య విశేషం. 2013 డిసెంబర్‌లో చిట్టచివరి సారిగా భారత జట్టు తరఫున వన్డే మ్యాచ్‌లో ఆడిన యువరాజ్.. అప్పటినుంచి ఇప్పటివరకు జట్టుకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. అయితే, ఈమధ్య కాలంలో దేశవాళీ మ్యాచ్‌లలో యువరాజ్ బాగా ఆడుతున్నాడని, దాన్ని తప్పనిసరిగా అభినందించి, గుర్తించాల్సిందేనని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ జట్టును ప్రకటించే సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. తాము వీలైనంత బెస్ట్ టీంను ఎంపిక చేశామని, ఇది వీలైనంత బెస్ట్ రిజల్ట్ ఇస్తుందనే ఆశిస్తున్నామని ప్రసాద్ తెలిపారు.