'ఆ అర్హత యువరాజ్ కు ఉంది'
న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు మరొ ఛాన్స్ ఇస్తే బాగుండేదని బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి రెండు వన్డేలకు యువీకి సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చి చూడాల్సిందన్నాడు. రంజీ ట్రోఫీలో పంజాబ్ తరపున ఆడుతున్న యువీ.. గుజరాత్ పై భారీ సెంచరీ చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. 'యువీని చివరి రెండు వన్డేలకు ఎంపిక చేయాల్సింది. కనీసం ఒక్క వన్డేలోనైనా అవకాశం ఇవ్వాల్సింది. రంజీల్లో గుజరాత్ పై అద్భుతమైన సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఎంపిక కాకపోవడం కాస్త బాధగానే ఉంది'అని గవాస్కర్ తెలిపాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్నవన్డే సిరీస్ లో టీమిండియా వెనుకబడి ఉన్న సమయంలో సీనియర్ల అవసరాన్ని కూడా సెలెక్టర్లు గుర్తిస్తే బాగుండేదని గవాస్కర్ పేర్కొన్నాడు. టీమిండియాకు వన్డే సిరీస్ గెలవడం ముఖ్యమని, దాంతో పాటు తర్వాత సీజన్ కు కూడా అనుభవం అనేది జట్టులో ఉండాలని ఒక ప్రశ్నకు సమాధానంగా గవాస్కర్ పేర్కొన్నాడు. గత టీమిండియా క్రికెట్ చరిత్రలో యువరాజ్ ఎన్నో అద్భుతమైన విజయాలను అందించడని గవాస్కర్ తెలిపాడు. యువరాజ్ కు మరోసారి అవకాశం ఇచ్చే అర్హత అతనికి ఉందన్నాడు. 2013, డిసెంబర్ లో లో సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో యువీ చివరిసారి ఆడాడు. కాగా, ట్వంటీ 20 ల్లో మాత్రం గత సంవత్సరం ఏప్రిల్ లో ఢాకాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో యువీ ఆఖరిసారి కనిపించాడు.