ఆ రెండు కారణాల వల్లే యువీకి..
ముంబై: ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్‌లకు భారత జట్టు ఎంపికలో విశేషమేంటంటే ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పునరాగమనం. మూడేళ్ల విరామం తర్వాత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న యువీ సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులోకి రావడానికి కారణమేంటంటే అతని ఇటీవలి ప్రదర్శనే. రంజీ ట్రోఫీలో రాణించడం ద్వారా భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అంతేగాక ఇంగ్లండ్‌పై ఈ డాషింగ్ ఆల్‌రౌండర్‌కు మెరుగైన రికార్డు ఉండటం కూడా కలసి వచ్చింది.
2016-17 రంజీ సీజన్‌లో యువీ అద్భుతంగా ఆడాడు. పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన యువీ ఐదు మ్యాచ్లలో 84 సగటుతో 672 పరుగులు చేశాడు. ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఢిల్లీలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో యువీ 26 ఫోర్లు, 4 సిక్సర్లతో 260 పరుగులు చేశాడు. అతను మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించడానికి ఈ ప్రదర్శన ఉపయోగపడింది. ఇక ఇంగ్లండ్‌పై అతనికి మంచి రికార్డు ఉంది. ఆ జట్టుపై మొత్తం 34 వన్డేలాడిన యువీ 48.62 సగటుతో 1313 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.