
హరారే: మ్యాచ్ ఫిక్సింగ్‌లో క్రికెటర్‌ను భాగం చేసేందుకు ప్రయత్నించిన జింబాబ్వే క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర చర్య తీసుకుంది. జింబాబ్వేలోని హరారే మెట్రోపాలిటన్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి, మార్కెటింగ్ డైరెక్టర్ రాజన్ నాయర్‌పై 20 ఏళ్ల నిషేధం విధించింది. గత అక్టోబర్‌లో జింబాబ్వే కెప్టెన్ గ్రేమ్ క్రెమర్‌ను కలిసిన నాయర్... ఫిక్సింగ్ చేస్తే 30 వేల డాలర్లు (దాదాపు రూ. 20 లక్షలు) ఇస్తానని ఆఫర్ చేశాడు.
అయితే దీనికి స్పందించని క్రెమర్ వెంటనే ఐసీసీకి సమాచారం అందజేశాడు. 16 జనవరి, 2018 నుంచి 15 జనవరి, 2038 వరకు రాజన్‌పై నిషేధం అమల్లో ఉంటుంది. రాజన్ చేసిన పని తీవ్రతను బట్టే అతనికి పెద్ద శిక్ష వేసినట్లు ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ తెలిపారు.