11 నుంచి సెలబ్రిటీ క్రికెట్
తమిళసినిమా:సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సందడి ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది.సినీ తారల క్రికెట్‌కు ఈసారి కూడా రెట్టింపు జోష్‌తో సిద్ధం అవుతున్నట్లు చెన్నై రైనోస్ జట్టు కొత్త కెప్టెన్ నటుడు జీవా పేర్కొన్నారు. ఈ లీగ్ పోటీలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సీసీఎల్ పోటీల వివరాలను గురువారం జీవా టీమ్ విలేకరులకు వెల్లడించారు. నటుడు జీవా వెల్లడిస్తూ ఈ జట్టుకు ఇంతవరకు నటుడు విశాల్ కెప్టెన్ బాధ్యతల్ని నిర్వహించేవారన్నారు. ప్రస్తుతం ఆయన చిత్రాలతో బిజీగా ఉండడంతో తానా బాధ్యతల్ని నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ జట్టుకు నటుడు విష్ణు విశాల్, వైస్ కెప్టెన్ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్య, విక్రాంత్, రమణ, భరత్, పృథ్వీ, శాంతను, అశోక్ సెల్వన్, బాలాజీ శ్యామ్, వేస్ వెంకట్, చరణ్‌కుమార్, ఉదయకుమార్, సంజయ్ భారతి జట్టు తరపున ఆడనున్నారని పరిచయం చేశారు.
ఈ చెన్నై రైనోస్ నిర్వాహకుడు జి.వి.ఆర్.గ్రూప్ గంగాప్రసాద్ మాట్లాడుతూ ఈ లీగ్‌లో చెన్నై రైనోస్‌తో పాటు తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్‌డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబై ఇండియన్స్, వీర మరాఠి, బెంగాల్ టైగర్స్, భోజ్‌పురి ద బాగ్స్ జట్లు పోటీలో పాల్గొంటున్నాయని వెల్లడించారు. చెన్నై రైనోస్ ఈ నెల 11న హైదరాబాదులో జరగనున్న లీగ్‌లో కేరళ స్ట్రైకర్స్‌తోను, 18న బెంగళూరులో జరిగే లీగ్‌లో వీరమరాఠి జట్టుతోను, 25న అహ్మదాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టీమ్‌తోను తలపడనుందని తెలిపారు. ఆ తరువాత ఫైనల్ మ్యాచ్ ఉంటుందని చెప్పారు. ఈసారి సీసీఎల్ క్రికెట్ పోటీలు చెన్నైలో జరగకపోవడం ఇక్కడి అభిమానులకు నిరాశ కలిగిందన్నారు.అయితే అనుమతి సమస్య కారణంగా చెన్నైలో సీసీఎల్‌ను నిర్వహించలేకపోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.