సంక్రాంతి కానుక
Published Fri, Dec 27 2013 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
సాక్షి, చెన్నై: సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో 3.45 కోట్ల మందికి ధోవతులు, చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాటి ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆదేశించింది. సంక్రాంతి పండగ (పొంగల్)ను పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రతిఏటా కార్డుదారులకు ఉచితంగా ధోవతులు, చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి ఏటా లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతోంది. కుటుంబ కార్డుదారులతో పాటు పేదలకు వీటిని అందజేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ పండగ సందర్భంగా బియ్యం, చక్కెర లేదా బెల్లం పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది 3.45 కోట్ల మందికి వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండుగ సమీపిస్తుండడంతో వీటి ఉత్పత్తిని వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 1.52 కోట్ల ధోవతులు సిద్ధమయ్యాయి. 56 లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయి. మరో వారం, పది రోజుల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అందరికీ పంపిణీ చేస్తాం
ఉచిత ధోవతులు, చీరల పంపిణీ గురించి జౌళి, చే నేత శాఖ మంత్రి ఎస్.సుందరరాజ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ఏడాది అత్యధిక శాతం మందికి వీటిని పంపిణీ చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. చీరలు, ధోవతుల ఉత్పత్తికి నాణ్యమైన నూలును ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. సంక్రాంతి పర్వదినం లోపు ఆయా జిల్లాలకు, అక్కడి నుంచి మండల కేంద్రాల ద్వారా రేషన్ డీలర్లకు అందజేస్తామని తెలిపారు. పండుగ నాటికి లబ్ధిదారులందరికీ వాటిని పంపిణీ చేస్తామని చెప్పారు. చేనేత ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గత ఏడాది రూ.217 కోట్ల ఉత్పత్తి జరగ్గా, ఈ ఏడాది రూ.246 కోట్ల మేరకు ఉత్పత్తి జరిగిందని వివరించారు. తేని, కన్యాకుమారి, అరంతాంగి, ఎట్టయాపురం, కృష్ణగిరిలోని నూలు ఉత్పత్తి కర్మాగారాల్ని మరింత బలోపేతం చేయనున్నామన్నారు. వీటి అభివృద్ధికి రూ.104 కోట్లు కేటాయించామని చెప్పారు.
Advertisement
Advertisement