పరప్పన అగ్రహార జైలు నుంచి తప్పించుకున్న సైకో కిల్లర్, సీరియల్ రేపిస్ట్ జయ శంకర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
బెంగళూరు, న్యూస్‌లైన్ : పరప్పన అగ్రహార జైలు నుంచి తప్పించుకున్న సైకో కిల్లర్, సీరియల్ రేపిస్ట్ జయ శంకర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర హోం మంత్రి కేజే జార్జ్ జైలును సందర్శించారు. జైలులోని ఆస్పత్రి ఆవరణలో ఉన్న ప్రత్యేక సెల్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడారు. సైకో కిల్లర్ జయశంకర్ ఆచూకీ చెప్పిన వారికి రూ. ఐదు లక్షల నగదు అందజేస్తామని అన్నారు.
జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జయ శంకర్ తప్పించుకున్నాడని, ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతకు వ ుుందు మాజీ హోం మంత్రి అశోక్ వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు. తాను మంత్రి పదవి చేపట్టిన సమయంలో ఆయన రాజకీయాల్లోకే రాలేదని అన్నారు. తనకు ప్రజలు ఇచ్చే సర్టిఫికెట్ చాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి జార్జ్ వెంట డీజీపీ లాల్‌రుకుం పచావో, జైళ్ల శాఖ డీఐజీ గగన్ దీప్, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్క్‌ర్ తదితరులు ఉన్నారు.
జైలులో గోడలు నేలమట్టం : పరప్పన అగ్రహారలోని ఆస్పత్రి పక్కన ఉన్న 15 అడుగుల ప్రహరీని సోమవారం నేలమట్టం చేశారు. జైలు ఆవరణంలో 15 అడుగుల ఎత్తు ఉన్న రెండు ప్రహరీల చివ రలో 30 అడుగుల ప్రహరీ ఉంది.
హైవేలలో నిఘా : జయశంకర్ కోసం పోలీసులు హైవేలపై నిఘా పెట్టారు. శంకర్ ఎక్కువగా సెక్స్ వర్కర్ల కోసం డాబాలకు వచ్చే అలవాటుందని అన్నారు. ఇదిలా ఉంటే శంకర్‌కు మానసిక నిపుణులు వైద్యం అందిస్తున్నారు. అయితే ఇతను తప్పించుకున్న తీరు చూసి పోలీసులు, వైద్యులు ఆశ్చర్యపోయారు. డీఐజీ విశ్వనాథ్ నేతృత్వంలోని మూడు ప్రత్యేక బృందాలు సైకో శంకర కోసం గాలిస్తున్నాయి.