సాక్షి, న్యూఢిల్లీ:నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దాకా సంబరాలు చేసుకోబోమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అర వింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాష్ర్ట విధానభ ఎన్నికల్లో 28 స్థానాలతో ఘనవిజయం సాధించిన సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులంతా బుధవారం సాయంత్రం జంతర్‌మంతర్‌లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల నేతృత్వంలో భారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాదాపు ఐదువేల మంది వరకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్న ఈ సభలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశంలో పేదరికం, అవినీతి, ఆకలి, ఆరోగ్య సమస్యలను పారదోలేదాకా తాము సంబరాలు చేసుకోబోమన్నారు.
అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని, మరోసారి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఢిల్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు యోగేంద్రయాదవ్, కుమార్ విశ్వాస్,గోపాల్‌రాయ్ ప్రసంగించారు. అన్నా హజారే చేస్తున్న ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ భయపడుతోందని పార్టీ మరోనేత యోగేంద్రయాదవ్ పేర్కొన్నారు. ఆప్ నాయకులకు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడమే తెలుసని, రాజకీయ కుట్రలు తెలియవన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్‌జైట్లీ నగరంలోని ఏ స్థానం నుంచైనా తమ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్‌పై పోటీ చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల వందేమాతర నినాదాలతో జంతర్‌మంతర్ హోరెత్తింది.
సంబరాలు కాదు సేవే ముఖ్యం
Published Wed, Dec 11 2013 11:49 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement