ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరంగేట్రంలో ప్రభం‘జనం’ సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహారాష్ట్రపై కన్నేసింది. ఈ ప్రాంతంలోని అన్ని
మహారాష్ట్రపై ఆప్ గురి
Published Tue, Dec 24 2013 1:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
ఔరంగాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరంగేట్రంలో ప్రభం‘జనం’ సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహారాష్ట్రపై కన్నేసింది. ఈ ప్రాంతంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయడంపై దృష్టి సారించింది. ఆదివారం నుంచి ప్రారంభమైన రెండు రోజుల రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆప్ కార్యకర్తలు, పార్టీని పటిష్టం చేసే దిశగా తీసుకోవల్సిన చర్యల గురించి రాష్ట్ర, జాతీయ కార్యనిర్వాహక సభ్యులు చర్చించారు. అన్ని జిల్లాలో ఉన్న పరిస్థితిని సమీక్షించాక 2014 ఎన్నికల్లో ఎన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందన్నది ప్రకటిస్తామని ఏఏపీ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులపై ఎవరినీ పోటీకి దింపితే బాగుంటుందనే దానిపై ప్రజల నుంచి సూచనలు తీసుకోనున్నామని ఆప్ వర్గాలు తెలిపాయి. నాగపూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ మాజీ అధ్యక్షుడు నితీన్ గడ్కరీపై అంజలి దమనియాను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌పై రిటైర్డ్ గవర్నమెంట్ ఇంజనీర్ విజయ్ పాండరేను పోటీకి దింపే విషయాన్ని పార్టీ పరిశీలిస్తోందన్న వాదనలు వినబడుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు గడ్కారీపై తాను పోటీ చేస్తానన్న విషయాన్ని చెప్పలేనని దమనియా అన్నారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై పోటీచేసి ఘన విజయం సాధించిన కేజ్రీవాల్ బాటలోనే మరికొందరిని ప్రముఖ నేతలపై బరిలోకి దింపి సానుకూల ఫలితాన్ని రాబట్టుకోవాలనుకుంటున్నామని చెప్పా రు. రాయ్‌గఢ్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని దమనియా విమర్శించారు. ఈ విషయంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో వ్యాపార సంబంధాలు ఉండటంతోనే గడ్కరీ మిన్నకుండా ఉండిపోతున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తును పూర్తి చేసి ఆప్‌లోడ్ చేయాలని చెప్పారు.
Advertisement
Advertisement